
కౌల లంపూర్ : మలేషియాలో దారుణం చోటు చేసుకుంది. ప్రజలందరి సమక్షంలో లైవ్ ప్రదర్శన ఇస్తుండగా.. ఓ స్టంట్ మాస్టర్ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఈ వార్తను స్థానిక మీడియా ప్రసారం చేసింది.
68 ఏళ్ల లిమ్ బా ‘హ్యుమన్ స్టీమింగ్’ పేరిట గత కొన్నేళ్లుగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కింద మంటపెట్టి దానిపై చెక్క లాంటి ఓ వస్తువును పరిచి దాని మీద లిమ్ కూర్చుంటారు. అతనిపై ఆవిరి యంత్రాన్ని బోర్లించి.. కాసేపు అలా ఉంచుతారు. ప్రదర్శన జరిగే 30 నిమిషాలపాటు ఆయన కదలకుండా అలానే ఉంటారు. అంతేకాదు ఆ ఆవిరి యంత్రంపై రోట్టెలు, మొక్కజొన్న పొత్తులు కూడా కాలుస్తుంటారు. పదేళ్లుగా ఆయన ప్రదర్శనలు ఇస్తూనే వస్తున్నారు.
తాజాగా కేదా రాష్ట్రంలో తావోయిస్ట్ ఉత్సవాల సందర్భంగా సోమవారం అక్కడి చైనీస్ దేవాలయం వద్ద ఆయన ప్రదర్శన ఇచ్చారు. అయితే యంత్రం బొర్లించిన కాసేపటికే లోపలి నుంచి కేకలు వినిపించసాగాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన సహాయకులు.. యంత్రాన్ని తీసి ఆయన్ని పక్కకు తీసుకెళ్లారు. అప్పటికే ఆయన చలనం లేకుండా పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే కాలిన గాయాలతోకాకుండా ఆయన గుండెపోటుతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక ఆయనకు ఇదే చివరి ప్రదర్శన అవుతుందని ఊహించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతేడాదే ఆయనకు గుండె ఆపరేషన్ అయ్యిందని.. తాము ఎంతో వారించినా మాట వినలేదని లిమ్ కొడుకు కంగ్ హువాయ్ చెబుతున్నారు.