ఆయనో విద్వేష ప్రబోధకుడు.. హ్యారీపొటర్ విలన్! | Sakshi
Sakshi News home page

ఆయనో విద్వేష ప్రబోధకుడు.. హ్యారీపొటర్ విలన్!

Published Wed, Dec 9 2015 12:46 PM

ఆయనో విద్వేష ప్రబోధకుడు.. హ్యారీపొటర్ విలన్! - Sakshi

లండన్: ముస్లింలను ఉద్దేశించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రిపబ్లికన్ ఫ్రంట్రన్నర్ డోనాల్డ్ ట్రంప్ పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.  ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించాలని, లండన్లో కొన్ని వర్గాలు రాడికల్ గా మారుతుండటంతో అక్కడి పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగత తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, ఫ్రాన్స్ ప్రధానమంత్రి మాన్యుయెల్ వాల్స్ తప్పుబట్టారు.

ఆయన వ్యాఖ్యలు మరింతగా విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు లండన్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు బ్రిటన్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డోనాల్డ్ ట్రంప్ ఓ విద్వేష ప్రబోధకుడని లేబర్ పార్టీ ఎంపీ స్టెల్లా క్రిసీ, ఎస్ఎన్పీ ఎంపీ తస్మినా అహ్మద్ షైక్ మండిపడ్డారు. డోనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో బ్రిటన్ రాకుండా నిషేధించాలని అక్కడి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద కార్యకర్తలు పలువురు డిమాండ్ చేశారు.

ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ కూడా డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. హ్యారీపొటర్ సిరీస్ లో అత్యంత కిరాతకమైన విలన్ వోల్డ్మార్ట్ తో ఆయనను పోల్చారు. వోల్డ్మర్ట్ కంటే దారుణంగా ఆయన వ్యవహరించారని మండిపడ్డారు. ఇటీవల  ఓ సర్వేలో రిపబ్లికన్ అభ్యర్ఠి డోనాల్డ్ ట్రంప్ కంటే వోల్డ్మార్ట్ బెటర్ అని బ్రిటన్ ప్రజలు అభిప్రాయపడ్డారు. అదేవిషయాన్ని ఆమె తాజాగా ఉటంకించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement