శరణార్థులకు ‘ఉగ్ర’ సెగ

Harassment of refugees in Sri Lanka - Sakshi

ఆత్మాహుతి దాడులతో శ్రీలంకలో మారిన పరిస్థితి

శరణార్థులకు వేధింపులు

తమిళ టీచర్, డాక్టర్‌ సహా 106 మంది అనుమానితుల అరెస్ట్‌

కొలంబో/కల్మునయ్‌: శ్రీలంకలో ఈస్టర్‌ రోజున ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. చర్చిలు, శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్న విదేశీ శరణార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయి. తమ దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ సహా 15 దేశాలకు చెందిన 1,600 మంది మైనారిటీ మతస్తులు శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్‌కు చెందిన క్రైస్తవులే ఉన్నారు. నెగంబో పట్టణంలో వీరికి ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. అయితే ఇదే పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చిని ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి దిగజారిపోయింది. ఈ శరణార్థులను వేధింపులకు గురిచేయడంతో పాటు వీరికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులను కొందరు స్థానికులు బెదిరిస్తున్నారు. మరోవైపు కల్మునయ్, సమ్మంతురై, చావలకడే ప్రాంతాలు మినహా దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.  

బుల్లెట్లు అయిపోవడంతోనే ఆత్మాహుతి
కల్మునయ్‌ పట్టణంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తమ సభ్యులేనని ఐసిస్‌ ప్రకటించుకుంది. అబూ హమ్మద్, అబూ సుఫియాన్, అబూ అల్‌క్వాలు భద్రతా బలగాలతో పోరులో బుల్లెట్లు అయిపోవడంతో తమనుతాము పేల్చేసుకున్నారని వెల్లడించింది.  మరోవైపు ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు దేశమంతటా విస్తృతంగా సోదాలు జరుపుతున్నాయి. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 106 మంది అనుమానితుల్ని అరెస్ట్‌ చేసినట్లు  తెలిపారు.  షాంగ్రీలా హోటల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల అన్న ఇర్ఫాన్‌ అహ్మద్‌ను అరెస్ట్‌ చేశామన్నారు.

అలాగే తమిళ మాధ్యమంలో బోధించే ఓ స్కూల్‌ టీచర్‌(40)ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.  సదరు టీచర్‌ నుంచి 50 సిమ్‌కార్డులు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్‌లో వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి జహ్రన్‌ హషీమ్‌ భార్య ఫాతిమా, కుమార్తె రుసైనాను ఉగ్రవాదుల స్థావరం నుంచి కాపాడామన్నారు. అలాగే నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌ నడుపుతున్న ఓ స్కూలులో ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరో డాక్టర్‌ను అరెస్ట్‌ చేశామన్నారు.

ఆ ముగ్గురిదీ ఒకే కుటుంబం
శ్రీలంకలోని కల్మునయ్‌ శుక్రవారం ఎన్టీజే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భద్రతాబలగాలతో కాల్పుల సందర్భంగా తమను తాము పేల్చేసుకున్న ముగ్గురు ఉగ్రవాదులు ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది. దాదాపు 15 మందిని బలికొన్న ఈ ఘటనలో ఉగ్రవాది మొహమ్మద్‌ హషీమ్, ఆయన కుమారులు జైనీ హషీమ్, రిల్వాన్‌ హషీమ్‌ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా విద్వేషాన్ని రెచ్చగొడుతూ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top