కార్బన్ ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరుగుతుందంటూ ఇంతవరకు శాస్త్రవేత్తలు అంచనావేసిన దానికన్నా ఎక్కువగా తాపోన్నతి పెరుగుతుందని శాస్త్రవేత్తల తాజా అంచనాలు తెలియజేస్తున్నాయి.
న్యూయార్క్: కార్బన్ ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరుగుతుందంటూ ఇంతవరకు శాస్త్రవేత్తలు అంచనావేసిన దానికన్నా ఎక్కువగా తాపోన్నతి పెరుగుతుందని శాస్త్రవేత్తల తాజా అంచనాలు తెలియజేస్తున్నాయి. భూతాపోన్నతిపై మేఘాల ప్రభావాన్ని అంచనా వేయడంలో పొరపాటు పడడం వల్లనే భూతాపోన్నతి విషయంలో కూడా అంచనాలు తప్పాయని యేలే యూనివర్శిటీ, లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబరేటరీ నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.
శిలాజ ఇంధనాల వినియోగాల వల్ల రెట్టింపు కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుందని, పర్యావసానంగా భూతాపోన్నతి 2.1 నుంచి 4.7 సెల్సియస్ డిగ్రీల వరకు పెరగవచ్చని ఇంతకుముందు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మేఘాలపై ప్రసరించే సూర్యకాంతి ఏమేరకు పరావర్తనం చెందుతుందో, దాని ప్రభావం భూతాపోన్నతిపై ఏ మేరకు ఉంటుందో అంచనావేయడంలో వారు పొరపాటు పడ్డారు.
మేఘాల్లో ఉండే మంచు సూర్యకాంతిని గ్రహించడం వల్ల భూతాపోన్నతి తీవ్రత తగ్గుతుందని ఇంతకుముందు శాస్త్రవేత్తలు భావించారని, వాస్తవానికి వారూహించినంత మంచు లేదా మంచు తాలూకు తేమ మేఘాల్లో లేదని అమెరికా నుంచి వెలువడుతున్న సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన ఓ వ్యాసంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాజా అంచనాల ప్రకారం భూతాపోన్నతి 4.7 కాకుండా 5.3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.