చేగువేరాను ఇండియాకు పంపిన క్యాస్ట్రో! | Sakshi
Sakshi News home page

చేగువేరాను ఇండియాకు పంపిన క్యాస్ట్రో!

Published Tue, Nov 29 2016 5:40 PM

చేగువేరాను ఇండియాకు పంపిన క్యాస్ట్రో!

‘‘జవహర్‌లాల్‌ నెహ్రూ నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు’’ అని చెప్పేవారు ఫిడెల్‌ క్యాస్ట్రో. 1960లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్‌ వెళ్లిన క్యాస్ట్రోను అదే సమావేశానికి హాజరైన నెహ్రూ, క్యాస్ట్రో బస చేసిన చోటుకు వెళ్లి మరీ కలిశారు. అప్పుడు క్యాస్ట్రో వయసు 34 ఏళ్లు. అనుభవం లేదు. అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనటానికి ముందున్న టెన్షన్ ఉంది. అలాంటి సమయంలో నెహ్రూ చూపిన ఆత్మీయతను తాను ఎన్నటికీ మరవలేనని అనేవారు క్యాస్ట్రో.

నెహ్రూ మీదే కాదు, భారత్‌ అన్నా కూడా  క్యాస్ట్రోకు ఎంతో అభిమానం. క్యూబాలో క్యాస్ట్రో పాలన మొదలయ్యాక, ఆ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశాల్లో ఇండియా ఒకటి. అందుకే భారత్‌తో సంబంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా చేగువేరాను ఇండియాకు పంపారు క్యాస్ట్రో. అలా రెండు వారాల పర్యటన నిమిత్తం చే బృందం 1959లో ఇండియా వచ్చింది. అందులో చేతో పాటు మరో ఆరుగురు– ఒక ఆర్థికవేత్త, ఒక మ్యాథమెటీషియన్, విప్లవబృందంలో పనిచేసిన ఒక కెప్టెన్, రేడియో బ్రాడ్‌కాస్టర్, ఒక బాడీగార్డు– ఉన్నారు. వాళ్లు జూన్ 30న పాలం విమానాశ్రయంలో దిగారు. తెల్లారి తీన్ మూర్తి భవన్లో నెహ్రూను కలిశారు. ఇరు దేశాల్లో దౌత్య కార్యాలయాలను నెలకొల్పుకోవడం గురించీ, పరస్పర వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం గురించీ చర్చించారు. సమావేశానంతరం నెహ్రూ, ఏనుగు దంతం పిడివున్న ఒక కత్తిని చేకు బహూకరించారు. క్యూబా రాజధాని హవానాలోని చే మ్యూజియంలో ఇప్పటికీ అది భద్రంగా ఉంది.


1960లో హవానాలో భారత్‌ తన దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించింది. ఇరు దేశాలూ ఎన్నో అంశాల్లో పరస్పరం సహకరించుకున్నాయి. 1990ల్లో క్యూబాలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు భారత్‌ పది వేల టన్నుల గోధుమలూ, మరో పదివేల టన్నుల బియ్యమూ పంపింది. 2008లోనూ గుస్తావ్‌ తుఫాను క్యూబాను అల్లకల్లోలం చేసినప్పుడు భారత్‌ 20 లక్షల డాలర్ల ఆర్థిక సాయం అందించింది. అలాగే, భద్రతాసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలన్న విషయంలో క్యూబా మొదటినుంచీ మద్దతునిస్తోంది.
 

Advertisement
 
Advertisement