వాట్సప్‌లో ఈ లింకులు ఓపెన్ చేశారో..

వాట్సప్‌లో ఈ లింకులు ఓపెన్ చేశారో..

వాట్సప్‌లో ప్రతిరోజూ వివిధ గ్రూపులలో వందలాది మెసేజిలు వస్తుంటాయి. కొంతమంది రకరకాల లింకులు పంపుతుంటారు. ఏవేవో ఆఫర్లు ఉన్నాయంటూ ఊదరగొడతారు. కానీ, అలా వచ్చిన లింకులన్నింటినీ ఓపెన్ చేసి చూశారో.. మీరు సైబర్ దాడుల బారిన పడటం ఖాయమని తాజాగా ఓ హెచ్చరిక వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సప్ యూజర్లందరినీ ఈ మేరకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను మోసం చేసి, సులభంగా వారిని బుట్టలో పడేసేందుకు హ్యాకర్లు ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్‌లు ఉపయోగిస్తున్నారని ద సన్ పత్రికలో వచ్చిన కథనం పేర్కొంది. 

 

వాట్సప్ వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో కాలింగ్ ఈమధ్య వచ్చింది. వాస్తవానికి గూగుల్ ప్లేస్టోర్‌లో వాట్సప్‌ను అప్‌డేట్ చేసుకుంటే చాలు.. ఈ వీడియో కాల్స్ వచ్చేస్తున్నాయి. కానీ, చాలామంది దానికి సంబంధించి ఓ లింకును విపరీతంగా ఫార్వర్డ్ చేశారు. పొరపాటున అలాంటి లింకులను ఓపెన్ చేస్తే వెంటనే మన ఫోన్ వాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఫోన్లో భద్రపరిచిన వ్యక్తిగత డేటా మొత్తం ప్రమాదంలో పడుతుందని అంటున్నారు. గ్రూప్ వీడియో కాలింగ్ పేరుతో కూడా కొన్ని లింకులు వస్తున్నాయని, ఇవన్నీ చాలా ప్రమాదకరమని చెప్పాఉ. 

 

ఇక మరికొంతమంది అయితే.. నగరంలో ఏదో పెద్ద కార్యక్రమం జరుగుతోందని, దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెబుతూ ఒక ఈమెయిల్ పంపుతున్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తేనే దానికి రావడానికి వీలవుతుందంటారు. అలాంటి సైట్ ఓపెన్ చేస్తే వెంటనే మన సిస్టమ్ లేదా ఫోన్ హ్యాక్ అయిపోతుంది. డిజిటల్ నేరగాళ్లు ప్రపంచం నలుమూలలా ఉన్నారని.. వాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. 

 

భారతదేశంలో 16 కోట్ల మంది వాట్సప్ యూజర్లు ఉన్నట్లు ఈ నెల మొదట్లో ఆ సంస్థ తెలిపింది. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా వీడియో కాలింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ అన్ని ప్లాట్‌ఫారాల మీద పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సప్ పది భారతీయ భాషల్లోను, ప్రపంచవ్యాప్తంగా 50 భాషల్లోను అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దీన్ని 10 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top