హైవే రోడ్డు.. ఒంటరిగా పరుగెడుతున్న చిన్నారి..!!

Bus Driver Rescues A Child Running Barefoot On The Road - Sakshi

చిన్నారిని కాపాడిన బస్సు డ్రైవర్‌

విస్కాన్సిన్‌ : ‘రోడ్డుపై వెళ్తున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి’ అనే మాటకు ఓ మహిళా డ్రైవర్‌ అసలైన అర్థం చెప్పారు. మానవత్వానికి కాస్త అమ్మతనాన్ని జోడించి ఓ పసిప్రాణాన్ని కాపాడారు. గడ్డకట్టుకుపోయే చలిలో కాళ్లకు చెప్పులు లేకుండా.. ఒంటికి సరిపడా బట్టలు లేకుండా నడిరోడ్డుపై పరుగెడుతున్న ఓ 19 నెలల చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. ఆ బస్‌ డ్రైవర్‌ రాక క్షణంకాలం ఆలస్యమైనా పాప ప్రాణాలకు ముప్పు వాటిల్లేదే. ఈ ఘటన విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని మిల్‌వాకీ పట్టణంలో గత డిసెంబరు 22న జరిగింది.

ఆ రోజు ఉదయం మిల్‌వాకీ ట్రాన్సిట్‌ సంస్థకు చెందిన మహిళా డ్రైవర్‌ ఇరేనా ఇవిక్‌ డ్యూటీ నిమిత్తం బస్‌లో వెళ్తుండగా రోడ్డు డివైడర్‌పైన ఒంటరిగా పరుగెడుతున్న ఓ చిన్నారి కంటపడింది. గడ్డకట్టుకుపోయే చలిలో ఒంటరిగా ఉన్న ఆ చిన్నారిని చూసి ఆమె షాక్‌ తిన్నది. వెంటనే అప్రమత్తమై వాహనాన్ని పక్కకు నిలిపి పరుగెత్తుకుంటూ వెళ్లి ఇవిక్‌ ఆ చిన్నారిని బస్‌లోకి తీసుకొచ్చింది. ఇదంతా క్షణాల్లో జరగడంతో బస్‌లో ఉన్న ప్యాసెంజర్‌ అయోమయానికి గురయ్యారు. చలికి వణుకుపట్టి బిక్కుబిక్కుమంటూ తనవారి కోసం ఏడుస్తున్న ఆ చిన్నారి ఒక స్వెటర్‌ వేసి.. తన ఒళ్లో కూర్చోబెట్టుకుంది ఇవిక్‌.

ఇవిక్‌ అప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పాపను తీసుకెళ్లారు. కాగా, చిన్నారి తల్లికి మానసిక రుగ్మత ఉన్నందునే పాప ఇంట్లోనుంచి రోడ్డుపైకి చేరిందని అధికారులు తెలిపారు. పాపను ఆమె తండ్రికి అప్పగించారు. అప్రమత్తంగా వ్యవహరించి చిన్నారిని కాపాడిన ఇవిక్‌కు గురువారం సన్మానం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘సరైన సమయనికి అక్కడున్నా. లేదంటే చిన్నారికి పెద్ద ప్రమాదమే జరిగేది. దేవుడి దయవల్ల ఈ చిన్నారిని కాపాడగలిగా’ అని చెప్పుకొచ్చారు ఇవిక్‌. కాగా, గత కొన్ని నెలల కాలంలో మొత్తం 9 మంది పిల్లల్ని తమ బస్‌ డ్రైవర్లు స్పందించి కాపాడారని మిల్‌వాకీ కౌంటీ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ అధికార ప్రతినిధి మాట్‌ సిల్కర్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ట్రాన్సిట్‌ సంస్థ విడుదల చేసిన వీడియో వైరల్‌ అయింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top