అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్‌కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.

అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్‌ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్‌షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు.


