జంక్‌ ఫుడ్‌తో చూపు, వినికిడి కోల్పోయిన యువకుడు

A Boy Lost Sight and Hearing With Junk Food in England - Sakshi

చేత్తో మనసారా గోరు ముద్దలు పెట్టి తినిపిస్తే చాదస్తం అనుకుంటున్నారు. ఓ స్పూన్‌ చేత్తో పట్టుకుని నూడుల్స్‌ తింటే మావాడు ఎంత బాగా తింటున్నాడో అంటూ పిల్లల్ని చూసి తెగ మురిసిపోతున్నారు. ఇంట్లో చేసిన ఎంత కమ్మనిన వంటకమైనా మొహం తిప్పుకుంటారు. కానీ అష్టరోగాలు తెచ్చే జంక్‌ఫుడ్‌ను మాత్రం ఆవురావురుమంటూ తింటారు నేటి పిల్లలు. తిన్నంత సేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాతే.. దాని అసలు పైత్యాన్ని చూపిస్తుంది. ఇందుకు ఈ ప్రత్యక్ష ఉదాహరణ సాక్ష్యంగా నిలిచింది. జంక్‌ఫుడ్‌ తినే అలవాటుతో జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాడు ఓ యువకుడు. వివరాలు..

లండన్‌ : ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌ నగరంలో ఓ యువకుడు ఏడేళ్ల వయసు నుంచి జంక్‌ఫుడ్‌ మాత్రమే తీసుకునేవాడు. పండ్లు, కూరగాయలు అస్సలు ముట్టుకునేవాడు కాదు. స్కూలుకు వెళ్లేప్పుడు తల్లి లంచ్‌ బాక్స్‌లో రోజూ పండ్లు, ఇతర పోషకాహార పదార్ధాలు పెట్టినా వాటిని ముట్టుకోక సాయంత్రం లంచ్‌ బాక్సును అలాగే తెచ్చేవాడు. రోజూ ఇంటికి దగ్గర్లో ఉన్న దుకాణం నుంచి చిప్స్‌, సాసర్‌, వైట్‌ బ్రెడ్‌, ప్రాసెస్డ్‌ మాంసాహారంలను మాత్రమే తీసుకొని తింటుండడంతో పంతొమ్మిదేళ్లు వచ్చేసరికి అంధత్వం వచ్చింది. దాంతో పాటు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఇటీవల ఆ యువకుడు పై చదువుల నిమిత్తం ఐటీ కోర్సులో చేరాడు. కానీ  చూపు లేకపోవడం, చెవుడు వంటి సమస్యలతో ఆ కోర్సు నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు.

అతనికి సోదరి, సోదరుడు ఉన్నా వారు మంచి పోషకాహారం తీసుకోవడంతో వారికి ఎలాంటి సమస్య లేదు. చిన్నప్పటి నుంచీ సదరు యువకుడు సన్నగా ఉండడంతో తల్లి అతని బరువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ యువకుడు  చాలా సన్నగా, ఒక రేకులా కనిపిస్తున్నాడు. డాక్టర్లు అతనిని పరిశీలించి కౌన్సిలింగ్‌లో భాగంగా సమతుల ఆహారం, పండ్ల రసాలు, విటమిన్‌ ట్యాబ్లెట్టు ఇస్తే వాటిని కొన్నిరోజులు వాడి మళ్లీ యథావిధిగా జంక్‌ఫుడ్‌ తీసుకునేవాడు. దీంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఆ యువకుడి వయస్సు ఇప్పుడు 19 సంవత్సరాలు మాత్రమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top