నా గుండె పగిలింది; ఇతరుల కోసమే.. | Australia Father And Son Die As Trying To Save Drowning Tourist | Sakshi
Sakshi News home page

టూరిస్టును కాపాడబోయి తండ్రీకొడుకుల మృతి

Apr 22 2019 6:55 PM | Updated on Apr 22 2019 7:04 PM

Australia Father And Son Die As Trying To Save Drowning Tourist - Sakshi

నీళ్లలో మునిగిపోతున్న ఓ టూరిస్టును కాపాడబోయి తండ్రీకొడుకులిద్దరు మృత్యువాత పడటం పలువురిని కలచివేసింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని..

సిడ్నీ : ఆస్ట్రేలియాలోని విక్టోరియా తీరప్రాంతంలో గల పోర్ట్‌ క్యాంప్‌బెల్‌లో విషాదం చోటుచేసుకుంది. నీళ్లలో మునిగిపోతున్న ఓ టూరిస్టును కాపాడబోయి తండ్రీకొడుకులిద్దరు మృత్యువాత పడటం పలువురిని కలచివేసింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు...‘ నిస్వార్థం, ధైర్యసాహసాలకు మారుపేరు సర్ఫ్‌ లైఫ్‌సేవర్స్‌. వారికి ఎల్లప్పుడు మనం కృతఙ్ఞులుగా ఉండాలి. వాలంటీర్లు రోస్‌, ఆండ్రూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

వివరాలు.. క్యాంపెబెల్‌ పట్టణానికి చెందిన రాస్‌ పావెల్‌(71), అతడి కుమారుడు ఆండ్రూ(32) వాలంటీర్‌ లైఫ్‌సేవర్లుగా సేవలు అందించేవారు. ఆదివారం ట్వల్వ్‌ అపోస్టల్స్‌ సమీపంలో ఓ సర్ఫర్‌ నీటిలో మునిగిపోవడాన్ని గమనించారు. వెంటనే అతడిని కాపాడేందుకు బోటులో బయల్దేరారు. అయితే దురదృష్టవశాత్తు వారి బోటు బోల్తా పడటంతో నీళ్లలో పడిపోయారు. రక్షణ బృందాలు అక్కడికి చేరుకునే సమయానికే వారిరువురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన సదరు టూరిస్టును మాత్రం రక్షణ బృందాలు కాపాడగలిగాయి.

నా గుండె పగిలింది ఆండ్రూ..
ఈ ఘటనపై స్పందించిన ఆండ్రూ సహచరి అంబర్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘ప్రపంచంలోనే రెండు అత్యంత అందమైన ఆత్మలను ఈరోజు కోల్పోయాం. తమ కంటే ముందు ఇతరుల క్షేమం గురించే ఆలోచించే, ఇతరుల కోసమే నిస్వార్థంగా సేవచేసే వారు శాశ్వతంగా దూరమయ్యారు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, నా జీవితపు వెలుగు దివ్వె, నా చిన్నారుల తండ్రి ఈరోజు నన్ను విడిచి వెళ్లిపోయాడు. నా గుండె పగిలింది. మిస్‌ యూ ఆండ్రూ’ అంటూ గర్భవతి అయిన అంబర్‌ ఫేస్‌బుక్‌లో ఉద్వేగభరిత పోస్ట్‌ పెట్టారు. కాగా తమ ప్రాణాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా టూరిస్టును కాపాడేందుకు ధైర్యసాహసాలు ప్రదర్శించిన రోస్‌, ఆండ్రూలు రియల్‌ హీరోలు అంటూ సర్ఫ్‌ లైఫ్‌సేవింగ్‌ విక్టోరియా ప్రెసిడెంట్‌ పాల్‌ జేమ్స్‌ నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement