‘26/11’ సూత్రధారి హెడ్లీపై జైల్లో దాడి

Attack On Terrorist David Headley In American jail - Sakshi

అమెరికా జైల్లో తోటి ఖైదీల దాడి

ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స..

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

వాషింగ్టన్‌ : 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్‌ డేవిడ్‌ హెడ్లీ (58) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అమెరికాలోని షికాగోలో మెట్రోపాలిటన్‌ కరెక్షనల్‌ సెంటర్‌ (జైలు)లో శిక్షను అనుభవిస్తున్న హెడ్లీపై ఇద్దరు తోటి ఖైదీలు దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన హెడ్లీని అధికారులు ఆస్పత్రికి తరలించారు. జూలై 8న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి.. ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పాకిస్తాన్‌ ఏజెంట్‌గా, ఉగ్రవాదిగా పనిచేసిన హెడ్లీపై జైల్లో దాడి చేసిన వారు పోలీసులను కొట్టిన కేసులో జైల్లో శిక్షననుభవిస్తున్నారు. 26/11 కేసులో అప్రూవర్‌గా మారిన హెడ్లీ.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టు విచారణలకు హాజరయ్యాడు. 

లష్కరే ఆధ్వర్యంలో ఉగ్రశిక్షణ 
అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారిగా తరచూ పాకిస్తాన్‌ సందర్శించిన సమయంలో హెడ్లీకి లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. అనంతరం లష్కరే వద్దే ఉగ్రవాద శిక్షణ పొందిన హెడ్లీ.. ముంబైలో దాడి చేసేందుకు రహస్య ఏజెంటుగా పనిచేశాడు. రెక్కీలు నిర్వహించడంలోనూ సాయం చేశాడు. 168 మంది ప్రాణాలు బలిగొన్న ముంబై ఘటనకు సూత్రధారిగా నిలిచాడు. కోపెన్‌హాగన్‌లో మహ్మద్‌ ప్రవక్తపై కార్టూన్‌ వేసిన ఓ డానిష్‌ దినపత్రికపై దాడి కూడా హెడ్లీయే చేసినట్లు వెల్లడైంది. 2009 అక్టోబర్‌లో షికాగోలోని ఓహేర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాకిస్తాన్‌కు బయలుదేరుతుండగా హెడ్లీని పోలీసులు అరెస్టు చేశారు. 2013లో అమెరికా కోర్టు ముంబై దాడుల కేసులోనే ఈయనకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి ఈ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top