మళ్లీ భారత్‌పై దాడి జరిగితే..

Another Terror Attack on India Will be Extremely Problematic - Sakshi

పాకిస్తాన్‌కే తీవ్ర ప్రమాదం

ఆర్థిక సహకారాలు కావాలో వద్దో పాకే తేల్చుకోవాలి: అమెరికా

వాషింగ్టన్‌: భారత్‌పై మరో ఉగ్రదాడి కనుక జరిగితే పాక్‌ ప్రమాదంలో పడినట్లేనని అమెరికా హెచ్చరించింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకూడదని అమెరికా కోరుకుంటున్నట్లు బుధవారం వైట్‌హౌజ్‌లో సీనియర్‌ అధికారి చెప్పారు. ‘ఉగ్రసంస్థలపై పాకిస్తాన్‌ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భారత్‌పై మళ్లీ ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్‌కు అది తీవ్ర సమస్యాత్మకంగా మారుతుంది. దీనివల్ల భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంది’అని ఆయన పేర్కొన్నారు. ‘గతంలో కూడా చాలా మంది ఉగ్రవాదులను పాకిస్తాన్‌ అరెస్ట్‌ చేయడం చూశాం. కానీ కొద్ది నెలలకే వారిని విడుదల చేశారు. కొందరు ఉగ్రవాద నేతలు దేశవ్యాప్తంగా ప్రయాణించేందుకు ఇంకా అనుమతి ఉంది’అని చెప్పారు. ఆర్థికంగా అందుతున్న సహాయసహకారాలు కావాలో వద్దో పాకిస్తానే తేల్చుకోవాలని ఆయన సూచించారు.

పాక్‌ను చైనా కాపాడొద్దు..
పాకిస్తాన్‌ను కాపాడటం చైనా బాధ్యత కాదని, దీనికి బదులు ప్రపంచ దేశాలతో కలసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాక్‌పై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్‌ కార్యాలయానికి చెందిన సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పెట్టిన ప్రతిపాదనను చైనా వీటో అధికారంతో అడ్డుకోవడం ఎంతో నిరాశ కలిగించిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు సాంకేతిక కారణాలు చూపి నాలుగు సార్లు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top