ఆ మడుగులో అనకొండ చెలగాటం

Anaconda Kills Crocodile In Amazon Rainforest - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్రెజిల్‌ దక్షిణ ప్రాంతంలోని అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లో కార్చిచ్చు రగులుకుందంటూ ఇటీవల వచ్చిన వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ దావానలాన్ని కవర్‌ చేయడానికి వెళ్లాడేమోగానీ ప్రముఖ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ కేవిన్‌ డూలే (58) ఇటీవల అమెజాన్‌ అడవిలో పెంటానల్‌ వద్ద మొసళ్ల మడుగు పక్కన కూర్చొని భోంచేస్తున్నారు. ఇంతలో ఆ మడుగు నుంచి భారీ శబ్దం వచ్చింది. అటు తల తిప్పి చూడగా ఓ భారీ అనకొండ, ఓ మొసలి భీకరంగా పోరాడుతూ కనిపించాయి. 

డూలే వెంటనే భోజనం తినడం ఆపేసి.. ఆ జంతువుల భీకర పోరాటాన్ని కెమేరాలో బంధించేందుకు ప్రయత్నించారు. పసుపు పచ్చ శరీరంపై నల్లటి చారికలు గల అనకొండ ఏకంగా 28 అడుగుల పొడవు ఉందట. సాధారణంగా ఆ అడవిలో ఆ ప్రాంతంలో అనకొండలు 30 అడుగుల వరకు పొడగు ఉంటాయట. వాటి బరువు  250 కిలోల వరకు ఉంటుందట. నీటిలో ఆ రెండు జంతువులు కూడా చాల బలమైనవే. 

మొసలిని చుట్టిన అనకొండ నీటిలో మెలికలు తిరిగుతూ మొసలి రెండు కాళ్లను బలంగా విరిచివేసింది. దాంతో ఒక్కసారిగా కోపం, బాధతో మెలికలు తిరిగిపోయిన మొసలు ఒక్కసారి అనకొండ మెడ అందిపుచ్చుకొని కొరికిందట. అయినా లాభం లేకపోయింది. అనతికాలంలోనే మొసలి చనిపోయింది. ఎనిమిది నిమిషాల సేపు కొనసాగిన ఈ భీకర పోరాటంలో అనకొండ గెలిచినప్పటికీ అలసిపోయి నీటిలో మునిగిపోయిందని ఫొటోగ్రాఫర్‌ డూలే తెలిపారు. తన వృత్తిలో ఇలా అనకొండ, మొసలి పోరాటాలను ఒకటి, రెండు సార్లు మాత్రమే చూశానని, ఈసారి తనకు అదష్టం కలిసి రావడం వల్ల అతి దగ్గరి నుంచి ఆ దశ్యాలను చూడడమే కాకుండా తన కెమేరాలో ఆ దృశ్యాలను బంధించగలిగానని డూలే మీడియాకు వివరించారు. 

ఇంతకు ఈ రెండు జంతువుల్లో ఏదీ ముందుగా దాడి చేసిందని ప్రశ్నించగా, తాను చూసేటప్పటికే వాటి మధ్యం భీకర పోరాటం ప్రారంభమైందని, మొసలి రెండు కాళ్లను అనకొండ ముందుగానే విరిచేసినందువల్ల మొసలే అనకొండపై ముందుగా దాడి చేసి ఉంటుందని ఆయన చెప్పారు. సాధారణంగా అనకొండలు తాను వేటాడాలనుకొన్న జంతువు, ఊపిరాడకుండా తన శరీరంతో భిగించి చంపేస్తుందని, ఆ తర్వాత దాని భాగాలను నమిలి విరిచేస్తుందని ఆయన అన్నారు. ఇక్కడ మొసలిని ఊపిరాడకుండా నలిపేసి చంపడం కన్నా ముందే దాన్ని కాళ్లను, ఆ తర్వాత చేతులను విరిచేసిందంటే కచ్చితంగా మొసలే ముందుగా దాడి చేసి ఉంటుందని ఆయన అన్నారు. సాధారణంగా పందులు, జింకలు, చేపలతోపాటు చిన్న చిన్న జంతువులను తినే  అనకొండలు అప్పడప్పుడు మొసళ్లను  తింటాయట. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top