భారతీయ విద్యార్థులకు డేవిడ్‌సన్‌ ఫెలోషిప్‌

6 Indian American teens get prestigious Davidson Fellows scholarships - Sakshi

వాషింగ్టన్‌: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాల్లో భారత సంతతికి చెందిన విద్యార్థులు తమ సత్తా నిరూపిస్తున్నారు. తాజాగా ఆరుగురు విద్యార్థులు తమ ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక డేవిడ్‌సన్‌ ఫెలోస్‌ స్కాలర్‌షిప్‌– 2018 అందుకున్నారు. డేవిడ్‌సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అందించే ఈ స్కాలర్‌షిప్‌ ప్రపంచంలో 10 అతిపెద్ద స్కాలర్‌షిప్‌ల్లో ఏడోది.

ఏటా సైన్స్, మేథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంగీతం, సాహిత్యం, తత్వశాస్త్రం వంటి వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన 18 ఏళ్లలోపు విద్యార్థులకు దీన్ని అందజేస్తారు. శుక్రవారం వాషింగ్టన్‌లో ఆ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా వ్యాప్తంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన 20 మంది విద్యార్థులు నగదును అందుకున్నారు.

ఆ ఆరుగురు వీరే..
వర్జీనియాకు చెందిన కావ్య కొప్పరపు (18) కేన్సర్‌ చికిత్సలో నూతన ఆవిష్కరణలు చేసింది. కనెక్టికట్‌కు చెందిన రాహుల్‌ సుబ్రమణియన్‌ (17) దోమల్లో వచ్చే మార్పులతో ఆధారంగా ముందుగానే జికా వైరస్‌ను అంచనా వేసి హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేశాడు. వీరిద్దరు రూ.36.7 లక్షల చొప్పున నగదు అందుకున్నారు. న్యూజెర్సీకి చెందిన ఇషాన్‌ త్రిపాఠీ (16) కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ఇండోర్‌లో గాలి నాణ్యత పెంచి లక్షలాది మంది జీవితాలను వ్యాధుల నుంచి కాపాడాడు.

అరిజోనాకు చెందిన సచిన్‌ కోనన్‌ (17) భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను వేగంగా గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేశాడు. కణాల గమనంలో మార్పు వల్లే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నిరూపించిన వర్జీనియాకు చెందిన మరిస్సా సుమతిపాల (18) వైద్యశాస్త్ర విభాగంలో స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది. ఈ ముగ్గురికి రూ.18.3 లక్షల చొప్పున నగదు లభించింది. జన్యువులను మరింత మెరుగ్గా విశ్లేషించే వ్యవస్థను కనుగొన్నందుకు కాలిఫోర్నియాకు చెందిన రాజీవ్‌ మువ్వా (18) రూ.7లక్షలు అందుకున్నాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top