కౌగిలింత ఖరీదు 90 లక్షల రూపాయలు

5 Years Old Boy Destroy A Sculpture Cost 132000 Dollars In Kansas - Sakshi

కన్సాస్‌: అమెరికాలో ఓవర్‌ల్యాండ్ పార్క్‌, టోమాహాక్ రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్‌లో ఒక ఐదేళ్ల పిల్లవాడు తెలియక చేసిన చిన్న తప్పిదానికి దాదాపు 90 లక్షల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కమ్యూనిటీ సెంటర్‌లోని సర్వేలైన్‌ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సారా గాడ్మాన్‌ కొడుకు, ఐదేళ్ల పసివాడు అక్కడే ఉన్న ఓ విగ్రహాన్ని కౌగిలించుకుని, ఆడుకుంటున్నాడు. 

అయితే అనుకోకుండా ఆ విగ్రహం కాస్తా కింద పడి పగిలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న సారా వెంటనే అక్కడకు వెళ్లి తన కుమారున్ని ఇంటికి తీసుకొచ్చింది. పగిలిపోయిన విగ్రహం ఖరీదు మహా అయితే ఓ 800 డాలర్లు (ఇండియా కరెన్సీ ప్రకారం 55,076 రూపాయలు) ఉంటుంది. ఆ మొత్తాన్ని కట్టేస్తే గొడవ ఉండదని అనుకుంది.

అయితే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ సెంటర్‌ నుంచి సారాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తన కుమారుడు పగలకొట్టిన విగ్రహం ఖరీదు చూసిన సారాకు గుండె ఆగినంత పనయ్యింది. ఓ 800 డాలర్లు ఉంటుందనుకున్న విగ్రహం విలువ కాస్తా ఏకంగా 1,32,000 డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 90,87,540 రూపాయలు) గా ఉంది.

ముందు ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన సారా, తెరుకుని కమ్యూనిటీ సెంటర్‌ వారిని తిట్టడం ప్రారంభించింది. ‘అంత ఖరీదైన విగ్రహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా, కనీసం తాకకూడదనే హెచ్చరిక కూడా లేకుండా ఇలా జనాలు తిరిగే ప్రదేశంలో ఎలా ఉంచుతార’ని ప్రశ్నించింది. అంతేకాక డబ్బు చెల్లించనని తేల్చి చెప్పింది.

దాంతో కమ్యూనిటీ సెంటర్‌ అధికారులు ‘ఆ విగ్రహాన్ని సందర్శన నిమిత్తం ఇక‍్కడకు తీసుకొచ్చాము. అయినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద’ని తెలిపారు. విగ్రహం ఖరీదు చెల్లించనని చెప్పిన సారా, కంపెనీ వారు తీసుకునే చట్టపరమైన చర్యలను ఎదుర్కొడానికి సిద్దపడింది.

కానీ ఇంతలో కమ్యూనిటీ సెంటర్‌ అధికారి రైలీ ‘మా ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున బిల్లు చెల్లించమనే ఉత్తరాన్ని సారాకు పంపింది. కానీ మేము ఆ బిల్లును సారా కుటుంబం నుంచి వసూలు చేయాలనుకోవడం లేదు. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగిస్తామ’ని తెలిపారు. సారా కొడుకు పగలకొట్టిన విగ్రహం స్థానిక శిల్పి బిల్ లియన్స్‌ రూపొందించిన  ‘ఆఫ్రొడైట్ డి కాన్సాస్ సిటి’ అనే శిల్పం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top