ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చిన రాష్ట్రాలు

17 States Of America Filed Case On Trump Government Over International Students - Sakshi

విదేశీ విద్యార్థుల వీసాలపై ముదిరిన జగడం

17 రాష్ట్రాలతోపాటు గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు కూడా 

వాషింగ్టన్‌: విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం చేసిన మార్పులను దేశంలోని 17 రాష్ట్రాలు డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలు న్యాయస్థానంలో సవాలు చేశాయి. కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలో విదేశీ విద్యార్థులను వారి స్వదేశాలకు వెళ్లిపోయేలా చేయడం క్రూరమైన విషయమే కాకుండా చట్టవ్యతిరేకమైందంటూ రాష్ట్రాల తరఫు న్యాయవాదులకు నేతృత్వం వహిస్తున్న మసాచూసెట్స్‌ అటార్నీ జనరల్‌ మౌరా హీలీ వ్యాఖ్యానించారు.  హార్వర్డ్, మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు ఐసీఈకి వ్యతిరేకంగా కేసులు దాఖలు చేసిన కొన్నిరోజులకే 17 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాలు అదే చర్య తీసుకోవడం గమనార్హం.

ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా మాత్రమే విద్యాబోధన అందించే యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థులు వారి దేశాలకు వెళ్లిపోవాలని ఈ నెల 6వ తేదీన యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ మాసాచూసెట్స్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్, ఐసీఈలపై కేసు దాఖలైంది.  దీంతోపాటు ప్రముఖ ఐటీ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌లు కూడా న్యాయస్థానాల్లో సవాలు చేశాయి. హార్వర్డ్, మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌లో భాగస్వాములవుతున్నట్లు ఈ సంస్థలు  ప్రకటించాయి. అమెరికాలో దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top