రంగంలోకి గవర్నర్ | water war issue to go rajbhavan presence of Governor Narasimhan | Sakshi
Sakshi News home page

రంగంలోకి గవర్నర్

May 6 2016 2:10 AM | Updated on Aug 21 2018 11:41 AM

రంగంలోకి గవర్నర్ - Sakshi

రంగంలోకి గవర్నర్

తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదం రాజ్‌భవన్‌కు చేరింది.

ఏపీ, తెలంగాణ జల జగడంపై ఆరా
రాజ్‌భవన్‌కు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు
వివాదం, ప్రాజెక్టుల అనుమతులపై గవర్నర్ ప్రశ్నలు
ప్రాజెక్టులన్నింటికీ అనుమతులున్నాయన్న అధికారులు
ఏపీ సర్కారే అక్రమంగా పట్టిసీమ ప్రాజెక్టు
చేపట్టిందని వెల్లడి.. విభజన చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని స్పష్టీకరణ

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదం రాజ్‌భవన్‌కు చేరింది. తెలంగాణ ప్రాజెక్టులతో ఏపీకి అన్యాయం జరుగుతోం దంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహారదీక్షకు దిగనుం డడంతో ఉలిక్కిపడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ గురువారం రంగంలోకి దిగారు. తెలంగాణ సాగునీటి శాఖ ఉన్నతాధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించి దాదాపు 45 నిముషాలపాటు వారితో సమావేశమయ్యారు. జల జగడంపై ఆరా తీశారు. ఏదైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టదలిస్తే ముందుగా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుం దని సూచించారు.  కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులపైనా ప్రశ్నించారు. కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు వీలుగా అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
 అన్ని అనుమతులున్నాయి
 తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయని సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ గవర్నర్‌కు వివరించారు. ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలు, కృష్ణా, గోదావరిలో నీటి కేటాయింపులపై  వివరణ ఇచ్చారు. గోదావరిలో తమకున్న 954 టీఎంసీల నీటి వాటాను వాడుకునేలా కంతనపల్లి, ప్రాణహిత, దేవాదుల ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నామని వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే జీవో 72 ఇవ్వగా... అదే కృష్ణానదిలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై7న జీవో 159 ఇచ్చారని గుర్తు చేశారు.
 
 పట్టిసీమ ప్రాజెక్టుకు గతంలో ఎలాంటి అనుమతులు, జీవోలు లేవని, విభజన అనంతరం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై కచ్చితంగా బోర్డుకు తెలియజేయాల్సి ఉన్నా అలా చేయలేదన్నారు. పైగా అన్ని అనుమతులు ఉన్న తెలంగాణను తప్పు పడుతోందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. నిజానికి కృష్ణా జలాల వినియోగం విషయంలో బచావత్ అవార్డు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయని, అందులో కేవలం 100 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నామని గవర్నర్‌కు వివరించారు. మరిన్ని నీటి కేటాయింపుల కోసం ట్రిబ్యునల్‌తోపాటు న్యాయస్థానాలను ఆశ్రయించామని చెప్పారు.
 
 అనుమతులకు బోర్డుకు సంబంధం లేదు
 కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చట్టంలోని క్లాస్ 84(8) ఏ ప్రకారం బోర్డు కేవలం నీటి సరఫరాను నియంత్రిస్తుందే తప్ప ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి దానికి ఎలాంటి అధికారం లేదని అధికారులు గవర్నర్  దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లాలో 80 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా అక్రమమని, రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఈ ప్రాజెక్టును చేపట్టిందని గవర్నర్‌కు చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ కానీ, బోర్డు అనుమతి కానీ లేకుండానే తెలంగాణ హక్కులకు భంగం కలిగేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని వివరించారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84(3), 85(8)కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. 1978లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య జరిగిన ఒప్పందం మేరకు పోలవరం ప్రాజెక్టు నుంచి మాత్రమే 80 టీఎంసీల నీటిని మళ్లించాలని, అంతకుమించి మళ్లిస్తే, ఆ నీటిని మూడు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement