రన్..రన్.. విశ్వనగరం వైపు.. | Towards the development of city | Sakshi
Sakshi News home page

రన్..రన్.. విశ్వనగరం వైపు..

Jul 24 2015 12:04 AM | Updated on Sep 3 2017 6:02 AM

రన్..రన్.. విశ్వనగరం వైపు..

రన్..రన్.. విశ్వనగరం వైపు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పథకాల వైపు అడుగులు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

అభివృద్ధి దిశగా అడుగులు
సుమారు రూ.300 కోట్లతో పనులు
మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, మార్కెట్ల నిర్మాణం
బస్ షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలకు సన్నాహాలు

 
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి పథకాల వైపు అడుగులు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వివిధ సౌకర్యాల కల్పన దిశగా అధికారులు చురుగ్గా కదులుతున్నారు. వీటి కోసం బడ్జెట్‌లో దాదాపు రూ.300 కోట్లు కేటాయించారు. స్థలాల సమస్యతో ఇన్నాళ్లూ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది.ఎట్టకేలకు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన దాదాపు 170 స్థలాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాల కల్పనకు యోచిస్తున్నారు.

ప్రభుత్వ ఆమోదమే తరువాయి...
అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్లై ఓవర్లు.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు పేదలు, దిగువ మధ్య తరగతి వారి కోసం మార్కెట్లు, ఫంక్షన్ హాళ్లు, బస్ షెల్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విశ్వ నగరంలో భాగంగా అంతర్జాతీయ రహదారులు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లతో పాటు నగర ప్రజల కనీసావసరాలను తీర్చాలని స్పష్టం చేశారు. వీటికి జీహెచ్‌ఎంసీ వద్ద నిధులు ఉన్నప్పటికీ..  స్థలాలు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ైవె ద్య ఆరోగ్య శాఖకు చెందిన ఏడెకరాల స్థలం అమీర్‌పేటలో ఖాళీగా ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. అక్కడ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ప్రతిపాదించారు. ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆ స్థలం జీహెచ్‌ఎంసీ పరమైంది. అదే తరహాలో ఏయే విభాగాల వద్ద ఎంత స్థలం అందుబాటులో ఉందో గుర్తించే పనిలో పడ్డారు. ఆమేరకు వివరాలు సేకరించారు. ఈ స్థలాలను ప్రజా సదుపాయాల కల్పనకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నారు. అటు నుంచి ఆమోదం రాగానే పనులు చేపట్టాలని భావిస్తున్నారు.
 
ఇవీ సదుపాయాలు...

 గ్రేటర్ ప్రజల అవసరాల మేరకు దాదాపు వెయ్యి మార్కెట్లు, పేదలు, మధ్య తరగతి వారు కనీస చార్జీలతో ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు 50 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. వీటితో పాటు బస్ షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వీటి కోసం దాదాపు 25 ప్రభుత్వ విభాగాలకు చెందిన 170 స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ స్థలాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించవచ్చో అంచనా వేసి... వాటిని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. స్థలాల విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడ ఏ సదుపాయం కల్పిస్తే ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడుతుందనేఅంశంపైనా అధికారులు దృష్టి సారించారు. పార్కింగ్ సదుపాయాలు లేని... ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించే యోచనలో ఉన్నారు. వెయ్యి చదరపు అడుగులు... అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రదేశాల్లో ఫంక్షన్ హాళ్లు, మార్కెట్లు  నిర్మించాలని భావిస్తున్నారు. బహుళ అవసరాలు తీర్చేలా ఒకేచోట మార్కెట్లు, పార్కింగ్ ప్రదేశాలు, టాయ్‌లెట్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
 
విభాగాల వారీగా ఉన్న స్థలాలు...

 విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన స్థలాల వివరాలు... రెవెన్యూ- 64, విద్యాశాఖ -20, పోలీసు- 19, ఏపీ హౌసింగ్ బోర్డు-11, టీఎస్ ఆర్టీసీ-2, బీసీ కార్పొరేషన్-1, దేవాదాయ శాఖ-1 , అటవీ శాఖ-3, వైద్య,ఆరోగ్య శాఖ-7, వాటర్ బోర్డు-7, ఆర్టీఏ-1, హెచ్‌ఎండీఏ-3, న్యాయ శాఖ-2, కార్మిక శాఖ-1, పర్యావరణ శాఖ-1, ఎక్సైజ్-2, ఆర్‌అండ్‌బీ- 2, సాంఘిక సంక్షేమశాఖ-3, స్పోర్ట్స్-2, ట్రస్టు-2, వక్ఫ్ బోర్డు-2, మార్కెటింగ్ 4, పరిశ్రమలు-4, వ్యవసాయ శాఖ-4.

తొలిదశలో 56 మార్కెట్లు, 50 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, 70 బస్‌షెల్టర్లు, 20 మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. వీటిలో 4 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లకు స్థలాలు ఎంపిక చేశారు. జుమ్మేరాత్‌బజార్, ఈసామియా బజార్, దూద్‌బావితోపాటు సర్కిల్-13లోనూ స్థలాలు ఎంపిక చేశారు. ఒక్కో హాల్ నిర్మాణానికి దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు కాగలదని అంచనా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement