
విశ్వనగరిలో అడవి అందాలు
ప్రకృతితో గిరిజనులది విడదీయరాని బంధం. ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తూ అందులో మమేకమవుతారు గిరిజనులు.
నేడు వరల్డ్ మ్యూజియం డే
సిటీబ్యూరో: ప్రకృతితో గిరిజనులది విడదీయరాని బంధం. ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తూ అందులో మమేకమవుతారు గిరిజనులు. వారి జీవనశైలి ప్రకృతిలాగే రమణీయంగా ఉంటుంది. వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు చూపరులను కట్టిపడేస్తాయి. సామాన్య జనానికి దూరంగా తమదైన లోకంలో జీవించే అడవిబిడ్డలను చూడాలంటే కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి వెళ్లాలనుకుంటున్నారా ....? అయితే మీరు పప్పులో కాలేసినట్లే... మన భాగ్యనగరంలో గిరిజనులను దర్శించవచ్చు. వారి ఆటపాటలను, వారు చెప్పే ముచ్చట్లను మాసబ్‌ట్యాంక్ సంక్షేమ భవన్ ట్రైబల్ మ్యూజియంలో ఎంచక్కా ఆస్వాదించవచ్చు.
గ్రౌండ్ ఫ్ల్లోర్‌లో: గిరిజన సమాచారం తెలిపేలైబ్రరీ, ఆదివాసీల కాల చక్రం తెలిపే చిత్ర పటం ఉంది.
మినీ ఆడిటోరియంలలో: మానవుని పరిణామక్రమాన్ని తెలిపే మ్యూజియం ఉంది. 12 రకాల గిరిజన సంసృ్కతులను చూడవచ్చు.
మొదటి అంతస్తులో: గిరిజనుల జీవన విధానం ఉట్టిపడేలా గిరిజనుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. సాంస్కతిక గ్యాలరీలో గిరిజనుల సంగీత పరికరాలు, దృశ్యశ్రవణ విభాగంలో లఘుచిత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. 18 రాష్ట్రాల్లో ఉన్న గిరిజన సంగ్రహాలయాల్లో ప్రదర్శనకు ఉంచిన వస్తు విశేషాలను టచ్‌స్క్రీన్ కంప్యూటర్‌లో చూసుకునే వెసులుబాటు కల్పించారు.
రెండో అంతస్తులో...
కులదేవతల ప్రతిమలు, వేటకు, వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను వీక్షించవచ్చు. పండుగలకు చేసే నృత్య ప్రతిమలు, వాయిద్యా పరికరాలు, యానాది, ఎరుకల, కోయ్య, లంబాడీ, చెంచుల, సవరల ఇళ్లు విశేషంగా ఆకట్టుకుంటాయి.