నేడు డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌!

Today dee set notification  - Sakshi

21 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

సాక్షి, హైదరాబాద్‌: ‘డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ), డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌)’ కోర్సుల ప్రవేశపరీక్ష డీఈఈసెట్‌–2018 నోటిఫికేషన్‌ శుక్రవారం (13న) విడుదల కానుంది.  గురువారం జరిగిన సెట్‌కమిటీ సమావేశంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 21 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. పరీక్షలను వచ్చే నెల 20 తర్వాత ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్ష తేదీలను ఖరారు చేస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో డీఈఈసెట్‌ను నిర్వహిస్తారు.

మెదక్‌ డైట్‌లో డీపీఎస్‌ఈ కోర్సు
ఈసారి కొత్తగా మెదక్‌ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో (డైట్‌) డీపీఎస్‌ఈ కోర్సును ప్రభుత్వం అందుబా టులోకి తెస్తోంది. దీనిలో ప్రవేశాలను డీఈఈసెట్‌తో చేపట్టనున్నారు. డీపీఎస్‌ఈ కోసం వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. డీఈఈసెట్‌ కన్వీనర్‌గా రమణకుమార్‌ను నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ డైట్‌లు, 188 ప్రైవేటు డీఎ డ్‌ కాలేజీలు, ఒక డీపీఎస్‌ఈ కాలేజీలో కలిపి 10 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.

జిల్లాకో డైట్‌ ఇవ్వండి: రాష్ట్రంలో ప్రస్తుతం 10 పాత జిల్లాల్లోనే డైట్‌ కాలేజీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో లేవు. దీంతో ఆ 21 జిల్లాల్లో ప్రభుత్వ డైట్‌ కాలేజీలను మంజూరు చేయాలని విద్యాశాఖ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అయితే అన్నింటిని ఒకేసారి మంజూరు చేస్తారా.. విడతల వారీగా ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top