
శాడిస్టు భర్త
సంతానం కలగాలంటే తన నాన్న, చిన్నాన్నలతో గడపాలని భార్యను ఒత్తిడి చేసిన యువకుడిపై సంతోష్‌నగర్ పోలీసులు
►సంతానం కోసం తన తండ్రి, చిన్నాన్నలతో గడపాలని భార్యపై భర్త ఒత్తిడి
►పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు..నిందితుడిపై కేసు నమోదు
హైదరబాద్: సంతానం కలగాలంటే తన నాన్న, చిన్నాన్నలతో గడపాలని భార్యను ఒత్తిడి చేసిన యువకుడిపై సంతోష్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..సంతోష్‌నగర్ మోయిన్‌బాగ్‌కు చెందిన మహిళకు(23)కు ఈదిబజార్‌కు చెందిన ముజమిల్ మునీర్(26)తో గతేడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. మునీర్ తల్లిదండ్రులు సౌదీ అరేబియాలో ఉంటుండగా, అతని చిన్నాన్న ముబీనోద్దీన్(45) చంచల్‌గూడలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఈదిబజార్‌కు వచ్చే ముబీనోద్దీన్ వరుసకు కుమారుడైన మునీర్ భార్యపై కన్నేశాడు.
ఈ క్రమంలోనే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు ఈ విషయాన్ని భర్త మునీర్, అత్త, మామలకు దృష్టికి తీసుకెళ్లింది. అయితే వారు అతడిని మందలించకపోగా ఇలాంటి విషయాలు బయట చెప్పుకుంటే పరువు పోతుందని....సంతానం కోసం అతను చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు. బాధితురాలికి ఆమె భర్త మునీర్ అండగా నిలవకపోగా..‘నీకు సంతానం కలగాలంటే తన తండ్రి..లేదా పినతండ్రితో గడపాలని భార్యపై ఒత్తిడి చేయసాగాడు. దీనిని అలుసుగా తీసుకున్న ముబీనోద్దీన్ మరింత రెచ్చిపోయాడు. ఆమె ఫోన్‌కు అసభ్యకర సందేశాలను పంపడమేగాక ఈ నెల 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తప్పించుకుని పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో బాధితురాలు మంగళవారం రాత్రి దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కేసు నమోదు చేసి విచారణ జరపాలని డీసీపీ ఆదేశించడంతో పోలీసులు మునీర్, ముబీనోద్దీన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది భార్య భర్తల గొడవేనని....రాజీ కుదురుతుందంటూ ఇన్‌స్పెక్టర్ శంకర్ పేర్కొనడం గమనార్హం.