తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి.
	రహమత్‌నగర్: తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు నగరంలోని అమ్మవార్ల ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఆయా ఆలయ కమిటీ సభ్యులు, బస్తీల నాయకులు ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాలకు రంగురంగుల విద్యుత్తు దీపాలు అలంకరించి, దేవాలయాలు ప్రాంతాల్లో రహదారులు మరమ్మతులు చేపట్టారు. అమ్మవారి ఘటాల ఊరేగింపు కోసం యువకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శివసత్తులు, పోతురాజులకు డిమాండ్ పెరిగింది. డప్పుల అద్దెలు భారీగా పెరిగాయి. బోనాలకు ఉపయోగించే సామగ్రి, కుండలకు భలే గిరాకీ పెరిగింది.
	
	పోతురాజులు, పోటాపోటీగా నేతలకు ఆహ్వానం....
	తమ బస్తీల్లో జరుగుతున్న బోనాల ఉత్పవాలకు వివిధ పార్టీల నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు పలకడంలో యువకులు పోటీపడుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన నేతలకు బస్తీలకు చెందిన యువకులు ఇప్పటికే ఆహ్వానాలు అందించారు.
	
	ఫ్లెక్సీల కోసం క్యూ..
	బోనాల జాతరలో పాల్గొనేందుకు వస్తున్న నాయకులకు, భక్తులకు ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేయనున్న ఫ్లెక్సీలకు యమ గిరాకీ ఉంది. రహమత్‌నగర్, క్రిష్ణానగర్, ఎస్.ఆర్ నగర్, దిల్‌షుక్‌నగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీ తయారీ కేంద్రాల వద్ద యువకులు క్యూ కట్టారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
