ప్రత్యక్ష పన్ను వసూళ్లలో తెలుగు రాష్ట్రాల ముందంజ

Telugu States is in the front foot on paying direct Taxes to the Income Tax Department - Sakshi

తెలంగాణ, ఏపీల్లో 30.9 శాతం వృద్ధి

జాతీయ సగటు 18 శాతమే

రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ ఏడాది వసూళ్ల లక్ష్యం రూ.50 వేల కోట్లు

ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎస్‌.పి.చౌదరి

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు దూసుకుపోతున్నాయని, జాతీయ స్థాయిలో పన్ను వసూళ్ల వృద్ధి 18 శాతం ఉంటే, ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 30.9 శాతం నమోదయిందని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ ఎస్‌.పి. చౌదరి చెప్పారు. రెండు రాష్ట్రాలు పన్ను వసూళ్లలో పోటీపడి ముందుకెళుతున్నా యని, రాష్ట్రాల అభివృద్ధికి ఇదో ఉదాహరణ అని అన్నారు. ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.50 వేల కోట్ల పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫెటాప్సీ) ఆధ్వర్యంలో వర్తక, పరిశ్రమ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై చార్టర్డ్‌ అకౌంటెంట్‌లతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు.

ఆదాయాన్ని పన్ను నుంచి ఎలా మినహాయించాలా అనే కోణం కన్నా... సరైన కారణం లేకుండా పన్ను మినహాయింపులు వ్యాపారులకు ఇవ్వకూడదనే ఆలోచనతో ఫెటాప్సీ ప్రతినిధులు పనిచేయాలని ఎస్‌.పి.చౌదరి సూచించారు. దేశం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా పన్ను చెల్లింపులు తప్పనిసరని, పన్ను చెల్లించడమంటే జాతి నిర్మాణంలో భాగస్వాములు కావడమే నని ఆయన వ్యాఖ్యా నించారు. పన్ను చెల్లింపు దారులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, పన్నుల శాఖ అధికారుల మధ్య వృత్తిప రమైన శత్రుత్వమే తప్ప వ్యక్తిగత శత్రుత్వాలకు తావుండకూడదని అన్నారు. వచ్చే జన్మంటూ ఉంటే తాను చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఫెటాప్సీ కో చైర్మన్‌ రాందేవ్‌ భుటాడా అధ్యక్షత వహించగా, ఫెటాప్సీ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ లుహరుక, ప్రత్యక్షపన్నుల కమిటీ చైర్మన్‌ సురేశ్‌ కుమార్‌జైన్, పలువురు ఆదాయపన్ను శాఖ అధికారులు, ఫెటాప్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top