బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి
- విద్యార్థులకు ప్రతిభా పారితోషికాలు
- రూ.2 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం
- హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు వసతి ఖర్చులు
- పేద బ్రాహ్మణులు చనిపోతే రూ.15 వేలు అందజేత
- రచయితలు, కవులకు రూ.50 వేల ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీతో కూడిన రుణాలు, విద్యార్థులకు ప్రతిభా పారితోషికాలు అందించాలని నిర్ణయించినట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రమణాచారి మీడియాతో మాట్లాడారు.
బ్రాహ్మణ యువతను వ్యాపార రంగంలో ప్రోత్సాహం అందించేందుకు రూ.5 లక్షల పెట్టుబడిలో 75 శాతం సబ్సిడీ, రూ.10 లక్షల పెట్టుబడిలో రూ.5 లక్షల సబ్సిడీ రూ.25 లక్షల పెట్టుబడిలో 30 శాతం సబ్సిడీని స్టార్టప్ గ్రాంట్‌గా అందించాలని నిర్ణయించామని రమణాచారి చెప్పారు. ఆసక్తి గల బ్రాహ్మణ యువత డెయిరీ ఫామ్, వ్యవసాయ పనిముట్లు, కిరాణ, మినీ సూపర్ మార్కెట్, ట్యాక్సీ, ఆటో, ట్రక్‌లు మొదలగు రవాణా వ్యాపారం, బోర్ వెల్స్, ఉద్యాన, వైద్య, మూలికల మొక్కల పెంపకం, బ్రాహ్మణ విద్యార్థుల కొరకు హాస్టల్ నిర్వహణ, నాట్యం, సంగీతం, ఫైన్ ఆర్ట్స్ కోచింగ్, క్యాటరింగ్, ఈవెంట్ ప్లాన్స్, ప్రింటింగ్ ప్రెస్ లాంటి వ్యాపారాల కొరకు బ్రాహ్మణ ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్‌మెంట్ స్కీం ఆఫ్ తెలంగాణ(బెస్ట్) పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
రూ.2 లక్షల వరకు ఆరోగ్య బీమా..
పరిషత్ సభ్యుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి మాట్లాడుతూ.. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి లబ్ధిదారుడు రూ.1,000 చెల్లిస్తే, పరిషత్ రూ.3,900 చెల్లిస్తుందని, దీని ద్వారా రూ.2 లక్షల వరకు కుటుంబంలో నలుగురికి వైద్య సహాయం లభిస్తుందని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ‘లక్ష్య పథకం’ కింద వసతి ఖర్చులు చెల్లిస్తామని తెలిపారు. సామూహిక ఉపనయనాలు నిర్వహించే బ్రాహ్మణ సంస్థలకు పరిషత్ ఆర్థిక సాయం అందిస్తుందని, ఒక్కో వటువుకు రూ.11,116 చెల్లిస్తుందని అన్నారు.
పేద బ్రాహ్మణులు చనిపోతే అత్యవసర ఖర్చుల కింద రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. పరిషత్ ఉపాధ్యక్షుడు జ్వాల నర్సింహారావు మాట్లాడుతూ.. బ్రాహ్మణ కవులు, రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అముద్రిత గ్రంథాల ప్రచురణకు రూ.50,000 వరకు ఆర్థిక సహాయం అందించాలని పరిషత్ నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో 50 పేజీల వరకు 1/5 సైజ్‌లో పుస్తకం ముద్రణకు సంబంధించిన రచనలను నలుగురు సభ్యుల కమిటీకి సమర్పించాలని ఆయన చెప్పారు.
విద్యార్థులకు ప్రోత్సాహకాలు..
2016–17 విద్యా సంవత్సరంలో బ్రాహ్మణ విద్యార్థులు పదో తరగతిలో 90 కంటే ఎక్కువ మార్కులు వస్తే రూ.7,500, ఇంటర్‌లో 80 శాతం కంటే ఎక్కువ వస్తే రూ.పది వేలు, డిగ్రీలో 70 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే రూ.15 వేలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 70 శాతం కంటే ఎక్కువ మార్కుల వస్తే రూ.20 వేలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో 80 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే రూ.35 వేలు ప్రతిభా పారితోషికంగా ఇవ్వాలని నిర్ణ యించామని రమణాచారి చెప్పారు. ఈ సదవకాశాన్ని బ్రాహ్మణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతిభకే ప్రోత్సాహం ఇస్తున్నామని, వీటికి ఆన్‌లైన్‌లో అక్టోబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల అడ్మిషన్ ఫీజులను రీయింబర్స్ చేయాలని నిర్ణయించామన్నారు.