వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2016-17) రూ.4,800 కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
నేడు అసెంబ్లీలో 2016-17 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న యనమల
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2016-17) రూ.4,800 కోట్ల రెవెన్యూ లోటుతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోవడం ఇది 8వసారి కానుంది. ప్రణాళిక, ప్రణాళికేతరం కలపి మొత్తం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,35,700 కోట్లను వ్యయం చేయనున్నట్టుగా బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నట్టు సమాచారం.
ఇందులో ప్రణాళిక వ్యయం రూ.49,200 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయం రూ.86,500 కోట్లుగా చూపనున్నట్టు తెలుస్తోంది. ప్రణాళికేతర పద్దులోని కొన్ని కేటాయింపుల్ని ఈసారి ప్రణాళిక పద్దులోకి తేవడంద్వారా ప్రణాళిక వ్యయం సైజును పెంచారు. కాగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయానికే పురపాలక మంత్రి పి.నారాయణ శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగాన్ని చదవనున్నారు. యనమల రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం శాసనసభలో వ్యవసాయ మంత్రి పి.పుల్లారావు, శాసనమండలిలో అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 10.45కి మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.