విభిన్నం, ప్రత్యేకం.. రామప్ప దేవాలయం!

special story about ramappa temple - Sakshi

యునెస్కో కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ చూడామణి నందగోపాల్‌

అదో గ్యాలరీ.. చూస్తే ఎన్నో నేర్చుకుంటామని వ్యాఖ్య

ప్రతి శిల్పం నృత్యరీతిలోని భంగిమనే

నర్తించి రుజువు చేసిన నర్తకి డాక్టర్‌ విద్య

అంతర్జాతీయ సదస్సులో అద్భుత ప్రదర్శన

సాక్షి, హైదరాబాద్‌ : రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తితే పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టడం పూర్వకాలంలో అమలైన పద్ధతి. అందుకే తెలంగాణలో కచీర్లు వెలిశాయి. రెండు వర్గాల వాదన విని కచీర్‌ ‘పెద్ద’ఇచ్చే తీర్పుతో ఆ వివాదం పరిష్కారమయ్యేది. మరి రెండు వర్గాలు దేవుడి సన్నిధిలో కూర్చుని పంచాయితీ జరిపితే..!!! కాస్త ఆశ్చర్యమే.

గౌందలి, యోగిని, నాగిని, పేరిణి.. ఇవన్నీ నృత్య రీతులు. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. చేతులతో డప్పు వాయిస్తూ, పాడుతూ, నర్తించాలి.. ఈ మూడింట మంచి ప్రవేశంతో ఏకకాలంలో జరపటం గౌందలి ప్రత్యేకత. ఇలా ఒక్కో ప్రత్యేకతతో ఉండి, వాటి రూపాలన్నీ దేవాలయంలోని శిల్పాల్లో అచ్చుగుద్దినట్టు ప్రస్ఫుటమైతే..!!!! సంభ్రమాశ్చర్యమే.

దేవాలయంలోని శిల్పాల భంగిమల నుంచి స్థానిక జానపద, ఇతర శాస్త్రీయ నృత్యరీతులు రూపుదిద్దుకుంటే..!!!! అబ్బురమే.      

...ఇలాంటి ప్రత్యేకతలు ఒకే గుడిలో కనిపిస్తే.. అది రామప్ప దేవాలయం అవుతుందని ప్రముఖ నర్తకి, చారిత్రక పరిశోధకురాలు, యునెస్కో కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ చూడామణి నందగోపాల్‌ అంటున్నారు. రామప్ప దేవాలయంపై పరిశోధన జరిపి తేల్చిన వివరాలతో చూడామణి త్వరలోనే ఓ పుస్తకాన్నీ రూపొందించబోతున్నారు.

దీన్ని ప్రచురించేందుకు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ముందుకొచ్చింది. శనివారం రామప్ప ప్రత్యేకతలను వివరిస్తూ ఆమె, తన శిష్యురాలైన నర్తకి డాక్టర్‌ విద్యతో కలసి గంటన్నర పాటు అంతర్జాతీయ హెరిటేజ్‌ సదస్సులో ప్రదర్శన ఇచ్చారు. రామప్ప నిర్మాణ వైషిష్ట్యాన్ని దృశ్యరూపకంగా వివరించారు. ఆలయంలో అత్యద్భుతంగా చెక్కిన శిల్పాల్లోని నృత్య భంగిమలను వివరిస్తూ డాక్టర్‌ విద్య నర్తించి చూపారు. ఈ ప్రదర్శన సదస్సుకు హాజరైన దేశవిదేశాలకు చెందిన ఆçహూతులను విశేషంగా ఆకట్టుకుంది.

శాసనం కోసమే ప్రత్యేక మండపం
కల్యాణి చాళుక్యుల హయాంలో నిర్మితమైన అన్ని ప్రధాన శివాలయాలను తాను చూశానని, వాటికంటే విభిన్నమైన ప్రత్యేకతలో కాకతీయుల కాలంలో రామప్ప నిర్మితమైందని చూడామణి వివరించారు. ఎత్తయిన కక్ష్యాసనం, మూలవిరాట్టు దిగువన ఉండే జగతి (ప్లాట్‌ఫామ్‌) చాలా ఉన్నతంగా ఉంటుందని, సభా మండపాన్ని తలపించే రంగమండపం నాడు దేవుడి సన్నిధిలో వివాదాలు పరిష్కరించుకునేందుకు, సభలు, నృత్య కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వాడి ఉంటా రని అభిప్రాయపడ్డారు.

వేడి ప్రాంతమైనందున ఆలయం వెలుపల నిలబడి జనం వీక్షించటం ఇబ్బందిగా ఉంటుందని, వెలుపలి వైపు ఎలాంటి ప్రత్యేక డిజైన్లు రూపొందించలేదని, కానీ లోపలి వైపు సంభ్రమాశ్చర్యాలు కలిగేలా అలంకరణలు చెక్కారని తెలిపారు. డోలమైట్, గ్రానైట్, ఇసుకరాయి, నీటిలో తేలే ఇటుకలతో మందిరాన్ని నిర్మించారన్నారు. శాసనం కోసమే ప్రత్యేక మండపం నిర్మించి ఉండటం మరెక్కడా కనిపించదని వివరించారు. ఆలయంలో మొత్తం 280 వరకు నృత్య భంగిమల శిల్పాలున్నాయని తెలిపారు.

జాయపసేనాని రాసిన నృత్యరత్నావళిలోని నృత్య భంగిమలు ఈ శిల్పాలను పోలి ఉంటాయని పేర్కొన్నారు. చిందు యక్షగానాలు కూడా వీటిని చూసే రూపొందించి ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. వెరసి రామప్ప దేవాలయం ఓ గ్యాలరీ.. అని చూస్తే ఎన్నో నేర్చుకుంటామని పేర్కొన్నారు. అనంతరం చూడామణి, విద్యలను హెరిటేజ్‌ తెలంగాణ సంచాలకుడు విశాలాచ్చి సన్మానించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top