ఫిబ్రవరిలో సెట్స్‌ నోటిఫికేషన్లు! | Sets notifications in February! | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో సెట్స్‌ నోటిఫికేషన్లు!

Jan 20 2018 2:50 AM | Updated on Apr 7 2019 3:35 PM

Sets notifications in February! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్‌)కు వచ్చేనెల తొలి వారంలో నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం వివిధ సెట్స్‌ కన్వీనర్లు, టీఎస్‌టీఎస్‌–టీసీఎస్‌ ప్రతినిధులతో ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అనంతరం వివరాలను పాపిరెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్లను సెట్స్‌ కన్వీనర్లు జారీ చేస్తారని వెల్లడించారు. విద్యామండలి వెబ్‌సైట్‌తోపాటు ఆయా సెట్స్‌ వెబ్‌సైట్లను అందుబాటులోకి తేవాలని, వాటిల్లో ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టుల లింకులను అందుబాటులో ఉంటా యని చెప్పారు. వెబ్‌సైట్లతో ఆరేడు పరీక్షల నమూనా పేపర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

ఇంటర్మీడియెట్‌ బోర్డు గ్రామీణ, ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ మాక్‌టెస్టుల నిర్వహణకు చర్యలు చేపడుతోందన్నారు. ఈసారి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నందున ఫీజులు స్వల్పంగా పెరుగుతాయన్నారు. సెట్‌ కమిటీల సమావేశాల్లో ఫీజులు నిర్ణయిస్తారని, నోటిఫికేషన్లలో వాటి వివరాలుంటాయని పేర్కొన్నారు. పరీక్షాకేంద్రాలను అన్ని పాత జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సెట్స్‌ కన్వీనర్లు కేంద్రాలను పరిశీలించాలని, అన్ని సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఆన్‌లైన్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలు, పరిష్కారాలపైనా చర్చించినట్లు తెలిపారు. 25 వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షలను రోజూ 2 సెషన్లుగా నిర్వహిస్తామని, వీటిల్లో ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్‌ పరీక్షలు ఉంటాయన్నారు. ఎంసెట్‌ పరీక్షలను 5 రోజులపాటు నిర్వహిస్తామని, రోజు ఉదయం 10 నుంచి 1 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. ఇంగ్లిషు, తెలుగుల్లో ఆన్‌లైన్‌ పరీక్ష పేపర్లు ఉంటాయని, గతంలో ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్‌లో బబుల్‌ చేసే విద్యార్థులు ఆన్‌లైన్‌లో టిక్‌ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement