ఆరు నెలల నరకం నుంచి విముక్తి | Redemption from six months hell | Sakshi
Sakshi News home page

ఆరు నెలల నరకం నుంచి విముక్తి

Jul 26 2017 1:06 AM | Updated on Aug 20 2018 7:33 PM

ఆరు నెలల నరకం నుంచి విముక్తి - Sakshi

ఆరు నెలల నరకం నుంచి విముక్తి

పొట్ట చేతపట్టుకుని పరాయి దేశమెళ్లిన నగర మహిళకు నరకం చూపించారు అరబ్‌ షేక్‌లు.

- అరబ్‌ షేక్‌ల చెర నుంచి బయటపడిన మహిళ 
బంధువులు, పోలీసుల సహకారంతో నగరానికి 
 
హైదరాబాద్‌: పొట్ట చేతపట్టుకుని పరాయి దేశమెళ్లిన నగర మహిళకు నరకం చూపించారు అరబ్‌ షేక్‌లు. ఆరు నెలల పాటు ఆమెతో గొడ్డు చాకిరీ చేయించుకుని... కొట్టి.. బంధించి చిత్ర హింసలు పెట్టారు. బంధువులు... ప్రభుత్వం... పోలీసుల సహకారంతో ప్రాణాలు దక్కించుకుని ఎట్టకేలకు నగరానికి చేరుకున్న ఆమె సౌదీ పేరు చెబితేనే భయంతో వణికిపోతోంది. మహబూబ్‌ నగర్‌కు చెందిన ఆయేషా బీ (45) కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి లాలాపేటలో నివాసం ఉంటోంది. శాంతినగర్‌కు చెందిన బ్రోకర్‌ గౌస్‌.. దుబాయ్‌ వెళితే భారీగా సంపాదించవచ్చని ఆయేషాను నమ్మించాడు.

ఆమె నుంచి రూ.లక్ష తీసుకున్న గౌస్‌... ఆయేషాను గత ఏడాది జూన్‌లో సౌదీకి పంపించాడు. నెలకు రూ.18 వేలు ఇస్తారని అక్కడ ఓ షేక్‌ ఇంట్లో ఆమె పనికి కుదిరింది. వెళ్లిన కొద్ది రోజులకే షేక్‌ కుటుంబం పైసా ఇవ్వకపోగా, ఆయేషాను కంటి నిండా నిద్రపోనీయకుండా, సరిపడా తిండి పెట్టకుండా వేధించడం మొదలుపెట్టింది. దీంతో ఓసారి ఇంటి నుంచి తప్పించుకోవడానికి ప్రయ త్నించిన ఆమెను షేక్‌ కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన ఆయేషాను నిర్బంధించి ఆరు నెలల పాటు నరకం చూపించారు. విషయాన్ని ఆమె ఎలాగో తన సోదరుడు, సామాజిక కార్యకర్త జహంగీర్‌కు ఫోన్‌ ద్వారా తెలిపింది. అతను సౌదీలో ఉన్న తన స్నేహితులు రఫీద్, ఇర్ఫాన్‌లకు చెప్పడంతో... వారు రెండు నెలలు శ్రమించి ఆయేషాను అక్కడి నుంచి తప్పించారు. తెలిసిన మరో షేక్‌ ఇంట్లో పెట్టారు. అక్కడా తిండి గింజల కోసం ఆరు మాసాలు ఆమె పనిచేయాల్సి వచ్చింది. ఈలోగా ఆమె సోదరుడు, మిత్రులు, హైదరాబాద్‌ పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలతో ఆయేషా తిరిగి నగరానికి చేరుకుంది.
 
చిల్లిగవ్వ ఇవ్వలేదు...
ఆరు నెలలు షేక్‌ ఇంట్లో పనిచేసినా తనకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయేషా ఆవేదనగా చెప్పింది. తాను అనుభవించిన నరకయాతన మరెవరూ పడకూడదని, నకిలీ వ్యక్తుల మాయలో పడి డబ్బు ఆశతో అరబ్‌ దేశాలకు వెళ్లవద్దని సూచించింది.  తనకు సహకరించిన పోలీసులు, ప్రభుత్వం, అధికారులు, మిత్రులకు కృతజ్ఞతలు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement