రైతు సదస్సులకు ప్రజాప్రతినిధులు

Public representatives to farmers' conferences - Sakshi

ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, కరీంనగర్‌లలో 25, 26 తేదీల్లో నిర్వహించే ప్రాంతీయ రైతు సమన్వయ సదస్సులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, డీసీసీబీ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్లను పిలువనున్నారు.

మంగళవారం ఈ మేరకు సదస్సుల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సదస్సుల సందర్భంగా ఒక ప్రత్యేక కరపత్రం రూపొందిస్తున్నట్లు తెలిపారు. మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారని చెప్పారు. 13 జిల్లాల ప్రాంతీయ రైతు సదస్సు హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో, మిగతా 17 జిల్లాలకు కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం ప్రసంగం..మధ్యాహ్నం సభ్యులతో సంభాషణ
రైతులకు గుర్తింపు కార్డులు, ప్రతి బస్సుకు బ్యానర్‌ ఎక్కడికక్కడ వ్యవసాయ అధికారులే ఏర్పాట్లు చేసుకోవాలని పార్థసారథి సూచించారు. సదస్సు రోజు ఉదయం 9.30 గంటలకు ముందే అధికారులు, జిల్లా, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు చేరుకునేలా ప్లాన్‌ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు రైతులకు ఒక గ్రీన్‌ ఫోల్డర్‌ నోట్‌ బుక్, రెండు పెన్నులు, ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో రెండు పేపర్లు అందజేయనున్నట్లు చెప్పారు. రైతులు తమ సలహాలను ఆకుపచ్చ కాగితంపైన, తమ ప్రశ్నలను గులాబీ రంగు కాగితంపైన రాసి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.

వాటిని వ్యవసాయ అధికారులు క్రోడీకరించి అందజేయాలని, వాటిపై ముఖ్యమంత్రి స్వయంగా స్పందిస్తారని తెలిపారు. ఉదయం సమావేశంలో సీఎం ప్రసంగిస్తారని, మధ్యాహ్న సమావేశంలో సీఎం రైతు సమితి సభ్యులతో సంభాషిస్తారని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.జగన్‌మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి, అదనపు వ్యవసాయ సంచాలకులు కె.విజయకుమార్, ఆర్టీసీ ముఖ్య మేనేజర్‌ మునిశేఖర్‌ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top