‘సామాజిక’ సైన్యం!

Political parties advertising for social media activists - Sakshi

సోషల్‌ మీడియా కార్యకర్తలు కావాలంటూ రాజకీయ పార్టీల ప్రకటనలు

ఒకప్పుడు ఎన్నికల యుద్ధమంటే వాల్‌ పోస్టర్లు.. కరపత్రాలు.. మైకులతో ప్రచార హోరు.. ఏమేం చేస్తామో చెబుతూ వాగ్దానాల జోరు.. ఇప్పుడు.. ఎన్నికల యుద్ధం వాల్‌ పోస్టర్ల నుంచి ఫేస్‌బుక్‌ వాల్‌ పోస్టులకు మళ్లింది.. మైకులతో ప్రచార హోరు వాట్సాప్‌లో పోరుగా మారింది.. ఏమేం చేస్తామన్న వాగ్దానాల జోరు కంటే ప్రత్యర్థులను దెబ్బకొట్టేలా యూట్యూబ్‌లో ఆడియో, వీడియో ప్రచారానికి తెర లేపింది. – సాక్షి,

సాక్షి, హైదరాబాద్‌ : మరి మారిన ఎన్నికల యుద్ధం కోసం అన్ని రాజకీయ పార్టీలు సరికొత్తగా ‘సామాజిక’సైన్యంతో సిద్ధమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందు కు, తమ ‘లైన్‌’ను జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఓటర్లలో ఎక్కువగా ఉన్న యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటినుంచే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గాల్లో నేతలు సైతం ఈ పరిస్థితులకు తగినట్టుగా మారిపోతున్నారు. తాము ఏ కార్యక్రమం నిర్వహించినా వెంటనే అందరికీ చేరేలా చూస్తున్నారు. ఇందుకోసం ఫేస్‌బుక్, వాట్సాప్, ట్వీటర్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌.. వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారు.

అన్ని పార్టీలదీ అదే దారి..
ఐదారేళ్ల కిందటి వరకు పెద్దగా సోషల్‌ మీడియాను పట్టించుకోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ.. గత ఎన్నికల నాటికి ఆ దిశగా దృష్టి సారించాయి. యువతను ఆకట్టుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారోద్యమాన్ని నిర్వహించాయి.

ముఖ్యంగా బీజేపీ దీనిని సమర్థంగా వినియోగించుకుంది. ప్రధాని మోదీకి సోషల్‌ మీడియా ప్రధాన ప్రచారాయుధంగా ఉపయోగపడింది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే దారిలో నడవాలని.. తన ఐటీ విభాగం నెట్‌వర్క్‌ను విస్తృతపర్చుకోవాలని నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడింది.

రాష్ట్రంలోనూ విస్తృతంగా..
తెలంగాణ విషయానికి వస్తే.. అధికార పార్టీలో ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగతా నాయకులెవరూ ఇప్పటిదాకా సోషల్‌ మీడియాను పట్టించుకోలేదు. పలుచోట్ల వారి ప్రత్యర్థులు గా, పోటీదారులుగా ఉన్న అభ్యర్థులు మాత్రం.. ప్రత్యేకంగా బృందాలను పెట్టుకుని మరీ జనంలోకి వెళుతున్నారు. నియోజకవర్గాల్లో జరిగే ప్రతి చిన్న కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో తాజాగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం సామాజిక మాధ్యమాల వినియోగంపై దృష్టి పెట్టారు.

పార్టీలు.. వ్యక్తులు.. ఎవరికి వారే!
ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతోపాటు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ జనసమితి కూడా తమ ప్రచారానికి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇన్నాళ్లూ చాలా వరకు నేతలు మాత్రమే వ్యక్తిగతంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక ముందు సంస్థాగతంగా బలం పెంచుకునేందుకు పార్టీల తరఫున.. అన్ని కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు.

ఇందుకోసం సిబ్బందిని, వలంటీర్లను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు. కోదండరాం ఇటీవలే పెట్టిన కొత్త పార్టీని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐదు వేల మంది కార్యకర్తలు (వలంటీర్లు) కావాలని ఫేస్‌బుక్, ట్వీటర్‌ వేదికగా ప్రకటించారు. అటు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ నేరుగా కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడేందుకు ఫేస్‌బుక్‌ లైవ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

మరోవైపు అధికార టీఆర్‌ఎస్‌ కూడా సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయాలంటూ ఫేస్‌బుక్, ట్వీటర్‌ల ద్వారా కార్యకర్తలకు సూచించింది. ఇక బీజేపీ కేంద్ర స్థాయిలో చేస్తున్న క్యాంపెయిన్‌ తరహాలో రాష్ట్రంలో చేపట్టేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేక బృందాలను నియమించారు. తెలంగాణ టీడీపీ మాత్రం ఇక్కడ పెద్దగా చురుగ్గా ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు మాత్రం వ్యక్తిగతంగా ప్రచారం చేసుకుంటున్నారు.

నెలకు రూ.2.5 లక్షల దాకా..
రాజకీయ పార్టీలు తమ సోషల్‌ మీడియా ఖాతాలను నేరుగా కార్యాలయం నుంచి నడిపిస్తుండగా... ప్రజాప్రతినిధులు, నేతలు విడిగా వారి నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా క్యాంపెయిన్‌ బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరికితోడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న పలువురు ఎన్నారైలు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న పలువురు నేతలు.. సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ కోసం పలు సంస్థల సేవలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలకు నెలకు రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

ఆ సంస్థలు అభ్యర్థి పేరు మీద ఫేస్‌బుక్, ట్వీటర్, యూట్యూబ్, వాట్సాప్‌ గ్రూపు ఖాతాలు తెరవడం, బల్క్‌ సందేశాలు పంపించడం, నియోజకవర్గాల్లో వివిధ వర్గాలను ఆ అభ్యర్థి వైపు మళ్లించేలా వ్యూహాలు రచించడం, సర్వేలు చేయడం, అనుకూల వాతావరణం సృష్టించే చర్యలు చేపట్టడం వంటివి చేస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు జిల్లాల వారీగా ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్న వారి ఫొటోలు పెట్టి ఆన్‌లైన్‌ పోల్‌ నిర్వహిస్తున్నాయి. దాంతో ఆశావహులు తమవైపు వీలైనంత మెజారిటీ ఉండేలా చూసేందుకు తంటాలు పడుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top