రెండో దశ మరిచిన మంత్రివర్యులు
రాష్ట్రంలోనే తొలిసారిగా రాజధాని నగరం హైదరాబాద్ నుంచి రెండు ప్రధాన మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు రానున్నాయి.
	రాష్ట్రంలోనే తొలిసారిగా రాజధాని నగరం హైదరాబాద్ నుంచి రెండు ప్రధాన మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు రానున్నాయి. రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం సమర్పించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నగరానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రాజెక్టులు, నిధులు కేటాయించకపోయినా.. మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు రెండు డబుల్ డెక్కర్ రైళ్లను మాత్రం ప్రసాదించారు. ఆకాశయానాన్ని తలపించే అందమైన ఈ డబుల్ డెక్కర్ రైళ్లలో ఒకటి హైదరాబాద్ నుంచి కలియుగ దైవం కొలువుదీరిన తిరుపతి పుణ్యక్షేత్రానికి.. మరొకటి నగరం నుంచి గుంటూరుకు పరుగులు తీయనుంది. ఇవి వారానికి రెండు రోజులే నడుస్తాయి.
	 
	 సాక్షి,సిటీబ్యూరో : ప్రతి ఏటా ఇదే తంతు. ఆశలు రేపి ఆఖరికి నిరాశలు మిగల్చడమే రైల్వే బడ్జెట్ ప్రత్యేకత. సగటు ప్రయాణికుల అవసరాలను పక్కనపెట్టి సాదాసీదాగా ముందుకొచ్చిన ఈ బడ్జెట్‌పై నగరవాసులు పెదవి విరుస్తున్నారు.
	     
	 ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.30 కోట్లు తప్ప ఈసారి ఒక్క పైసా కూడా విదల్చలేదు.
	     
	 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరల్డ్‌క్లాస్ ప్రతిపాదన పత్తా లేకుండా పోయింది.
	     
	 ప్రతి రోజు సుమారు 200 రైళ్లకు హాల్టింగ్ సదుపాయాన్ని అందజేస్తోన్న ఈ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే ఏళ్లనాటి ప్రతిపాదనకు ఈ ఏడాది కూడా మోక్షం లభించలేదు.
	     
	 లాలాగూడ కేంద్రీయ ఆసుపత్రికి సూపర్‌స్పెషాలిటీ హోదా కల్పించే అంశంపైన, నర్సింగ్ కళాశాల, మెడికల్ కళాశాల నిర్మాణాల పైన బడ్జెట్‌లో ఊసు లేదు.  
	     
	 పాతప్రాజెక్టుల సంగతి ఇలా ఉంటే కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా నగరానికి రాలేదు.
	     
	 ఎప్పుడూ రద్దీగా ఉండే శబరి, షిర్డీ, బెంగళూరు రూట్లకు కొత్తగా రైళ్లను ప్రకటించలేదు.
	     
	 లక్షలాది మంది భక్తులు వెళ్లే శబరికి ప్రస్తుతం ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది. షిర్డీకి కూడా రెండు రైళ్లే  ఉన్నాయి. రద్దీ అధికంగా ఉండే బెంగళూరుకు కూడా ఈ బడ్జెట్‌లో కొత్త రైళ్లను ప్రకటించకపోవడం దారుణం.
	     
	 రైల్వే కార్మికులను సైతం ఈ బడ్జెట్ నిరాశకు గురి చేసింది.
	 
	 గతంలో ఉద్యోగుల కోసం ప్రకటించిన హౌసింగ్ స్కీమ్‌పై ఎలాంటి ప్రస్తావన లేక పోవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
	 
	 డబుల్‌డెక్కర్ కథాక మామీషు..
	 దేశంలోని పలు మార్గాల్లో ఇప్పటికే పరుగులు తీస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లు దక్షిణమధ్య రైల్వేకు ఆలస్యంగానే ప్రకటించారు. గత రెండు మూడేళ్లుగా ఊరిస్తోన్న   ఈ రైళ్లకు ఎట్టకేలకు ఈ ఆర్థిక సంవత్సరంలో మోక్షం లభించింది.
	     
	 ప్రస్తుతం చెన్నై-బెంగళూరు, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-జై పూర్, హౌరా-ధన్‌బాద్, ముంబై- సూరత్, ఇండోర్- హబీబ్‌గంజ్ తదితర మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు  నడుస్తున్నాయి.
	
	 ఈ వరుసలో తాజాగా కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-గుంటూరు డబుల్ డెక్కర్ రైళ్లు రానున్నాయి.
	 
	 ప్రత్యేకత లివీ...
	     డబుల్ డెక్కర్‌లో బోగీకి 128 మంది పడతారు.
	     ఈ ట్రైన్‌లో 2700 మంది వరకు ప్రయాణించవచ్చు.
	     సాధారణ ఎక్స్‌ప్రెస్‌లో బోగీకి 78 మంది చొప్పున 1500 మందికే అవకాశం.
	     డబుల్ డెక్కర్ రైళ్లలో బెర్తులుండవు.
	     {పయాణికులు కూర్చునే ప్రయాణించాలి.
	     అందుకే ఇవి పగలే నడుస్తాయి.
	     గంటకు 62-110 కి.మీ. వేగంతో వెళ్తాయి.
	     వీటి ఎత్తు 4.366 మీటర్లు
	     (సాధారణ రైళ్ల ఎత్తు 4.025 మీ.).
	     బోగీలో కింది నుంచి పైకి వెళ్లేందుకు విశాలమైన మెట్లు
	     పూర్తి ఎయిర్ కండీషనింగ్‌తో కూడిన బోగీ
	     హాయిగా అనిపించే ఎయిర్ స్ప్రింగ్ సీట్లు
	     కుదుపులు లేని సౌకర్యవంతమైన ప్రయాణం
	     స్టెయిన్‌లెస్ స్టీల్ బోగీలతో మరింత భద్రత
	 
	 తిరుపతి ప్రయాణికులకు ఊరట
	 హైదరాబాద్ నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు.
	     
	 ప్రస్తుతం తిరుపతికి వెళ్లేందుకు వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, కృష్ణా, సెవెన్‌హిల్స్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి.
	     
	 కానీ ఈ రైళ్లు ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. దీంతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో వెయిటింగ్ జాబితా 250 నుంచి 350 వరకు నమోదవుతుంది.
	     
	 ఫలితంగా తిరుపతికి డబుల్ డెక్కర్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
