
పార్కులో పంచాయితీ!
అది బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కు... మంగళవారం ఉదయం 10.30 గంటలు. సుమారు 80 మంది వరకు పిల్లలు, పెద్దలు టిక్కెట్లు తీసుకొని ఎంచక్కా చెట్ల కింద కూర్చున్నారు.
బంజారాహిల్స్: అది బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కు... మంగళవారం ఉదయం 10.30 గంటలు. సుమారు 80 మంది వరకు పిల్లలు, పెద్దలు టిక్కెట్లు తీసుకొని ఎంచక్కా చెట్ల కింద కూర్చున్నారు. వనభోజనాలకో, కాలక్షేపానికో వీరంతా వచ్చారని అక్కడ ఉన్న వారు అనుకున్నారు. కొద్దిసేపటికి తేలిందేమిటంటే వాళ్లు వచ్చింది భార్యాభర్తల మధ్య నెలకొన్న ఓ వివాదంపై చర్చించేందుకు.
ఇంతలో ఒక పెద్దాయన లేచి మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకో వ్యక్తి.. ఇలా గంటన్నర పాటు సమావేశం ప్రశాంతంగా సాగింది. ఆ తర్వాత సంభాషణలు వేడెక్కాయి. పెద్ద మనుషులంతా కాలర్లు పట్టుకొని మరీ కొట్టుకోవడం ప్రారంభించారు. అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.. పార్కులో సందర్శకులు ఆందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. సుమారు అరగంట పాటు యుద్ధ వాతావరణం నెలకొంది.
ఆ తర్వాత పోలీసులు రావడం... పంచాయితీని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి... విషయంలోకి వెళ్తే... లంగర్‌హౌజ్‌కు చెందిన వేముల గణేష్‌కు, టెంపుల్ అల్వాల్‌కు చెందిన సుజాతకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రణయ్ రాజ్ అనే పదేళ్ల కొడుకు ఉన్నాడు. పెళ్లయిన రెండేళ్లకు దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. రూ.20 లక్షల కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ గణేష్ పేచీ పెట్టడంతో సుజాత కోర్టును ఆశ్రయించింది. ఈ మధ్యలో తన భర్త గణేష్‌కు అత్త విజయలక్ష్మి, మామ యాదగిరి కలిసి రెండో పెళ్లి చేశారంటూ సుజాత అనుమానించింది.
తనకు న్యాయం చేయాలంటూ పెద్దలను వేడుకోవడంతో అటు లంగర్‌హౌజ్ నుంచి గణేష్ తరఫున... ఇటు అల్వాల్ నుంచి సుజాత తరఫున పెద్దలు, బంధువులు పెద్ద ఎత్తున పార్కులో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీలోనే మాటామాటా పెరిగింది. తనకు అన్యాయం చేశాడంటూ గణేష్‌కు సుజాత దేహశుద్ధి చేసింది. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.