ఒక్కటైన నాగం వ్యతిరేకులు

The opponentes of nagam janartha reddy are togahter - Sakshi

కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దంటున్న ఉమ్మడి పాలమూరు నేతలు  

సాక్షి, నాగర్‌కర్నూల్‌: సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ లోకి తీసుకొచ్చే విషయంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. నాగం రాకను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య నేతృత్వంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి తదితరులు రోజంతా ఈ అంశంపై చర్చించినట్లు కాంగ్రెస్‌ వర్గాల ద్వారా తెలిసింది. 

బీజేపీకి రాజీనామా చేసిన నాగం జనార్దన్‌రెడ్డి స్థానిక నేతలైన కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, నంది ఎల్లయ్యకు కనీస సమాచారం ఇవ్వకుండా.. పార్టీలోకి వస్తున్నట్లు తానంతట తాను ప్రకటించుకోవడంపై వీరు మండిపడుతున్నారు. మరోపక్క తాను కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్‌ను గల్లంతు చేస్తానంటూ నాగం చెప్పుకోవడంపై డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు పెడుతున్నారని, ఇతరుల నియోజకవర్గాల్లో ఆయన అనవసర జోక్యాన్ని తీవ్రంగా ఖండించకపోతే మున్ముందు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. నాగం జనార్దన్‌రెడ్డి విషయంలో వాస్తవ పరిస్థితులను రాష్ట్ర, జాతీయ పార్టీల అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వారి అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదిలా ఉండగా వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, అలంపూర్‌ నేత సంపత్‌కుమార్‌ మాత్రం ఈ వర్గంతో జత కట్టనట్లు తెలుస్తోంది.  
 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top