‘మార్పిడి’ మార్గం! | nregistered registrations for vehicles sold | Sakshi
Sakshi News home page

‘మార్పిడి’ మార్గం!

Jun 12 2017 12:32 AM | Updated on Mar 28 2018 11:26 AM

‘మార్పిడి’ మార్గం! - Sakshi

‘మార్పిడి’ మార్గం!

సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం తన వాహనాన్ని అమ్మేశాడు.

వాహనాలు అమ్మినా మారని రిజిస్ట్రేషన్లు
ఇప్పటికీ ఈ–చలాన్లు పాత యజమానులకే..
ప్రత్యేక నెంబర్‌తో సమస్యకు పరిష్కారం
ఏర్పాట్లు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు
నెలాఖరు నుంచి ప్రయోగాత్మక అమలు


సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం తన వాహనాన్ని అమ్మేశాడు. దానిని కొన్న వ్యక్తి బైక్‌ రిజిస్ట్రేషన్‌ను తన పేరు మీదకి మార్చుకోలేదు. దీంతో అతడు చేసిన ట్రాఫిక్‌ ఉల్లంఘనలన్నీ పాత యజమాని ఖాతాలో పడుతున్నాయి. ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు భారీ మొత్తంలో ఈ–చలాన్లు బకాయిలున్న వారిపై న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇది తెలిసి మరింత ఆందోళనకు గురయ్యాడు. సిటీలో అనేక మంది ‘మాజీ వాహన యజమానుల’ పరిస్థితి ఇలానే ఉంది. దీన్ని సరిదిద్దేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక నంబర్‌ కేటాయించనున్నారు. దీనిని   ఈ నెలాఖరు నుంచి అమలు చేయనున్నారు.     

సిటీబ్యూరో: వాహనం ఎన్ని చేతులు మారినా.. రిజిస్ట్రేషన్‌ మాత్రం మొదట కొన్న వారి పేరిటే ఉండిపోతోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఓ పరిష్కార మార్గం యోచిస్తున్నారు. ‘ప్రత్యేక నెంబర్‌’ కేటాయించడం ద్వారా యాజమాన్యం మార్పిడికి సహకరించనున్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రయోగాత్మకంగా దీని సేవలు అందుబాటులోకి వస్తాయని డీసీపీ ఏవీ రంగనాథ్‌ ‘సాక్షి’కి తెలిపారు.

నిబంధనల ప్రకారం మార్చాల్సినా..
ప్రతి వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆర్టీఏ అధికారులు ఆ వాహనం నెంబర్‌తో పాటు యజమాని పేరు, చిరునామాను రికార్డుల్లో పొందుపరుస్తారు. ఎవరైనా తమ వాహనాలను విక్రయించేస్తే.. దాన్ని ఖరీదు చేసిన వ్యక్తికి సేల్‌ లెటర్‌తో పాటు సంబంధిత ఫారాలు సైతం సంతకాలు చేసి అప్పగించేస్తున్నారు. నిబంధనల ప్రకారం వాహనాన్ని ఖరీదు చేసిన వ్యక్తి ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా యాజమాన్యాన్ని తన పేరు, చిరునామాతో మార్చుకోవాలి. అయితే సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు ఖరీదు చేసిన వారు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఏళ్లు గడుస్తున్నా వాహనాలు పాత యజమానుల పేర్ల మీదే ఉంటున్నాయి. ఖరీదు చేసిన యజమానులు చేస్తున్న ఉల్లంఘనలన్నీ ఆర్టీఏ రికార్డుల ప్రకారం పాతవారి ఖాతాలో పడుతున్నాయి.

ఇప్పుడంతా ఈ–చలాన్‌..
నగరంలో ఒకప్పుడు కేవలం స్పాట్‌ చలాన్లు మాత్రమే ఉండేవి. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు ఉల్లంఘనుల్ని పట్టుకునేవారు. తక్షణమే వారు చేసిన ఉల్లంఘనకు చలాన్‌ రాసి జరిమానా మొత్తం కట్టించుకునేవారు. ప్రస్తుతం క్యాష్‌లెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విధానాలు అమలవుతున్నాయి. దీంతో స్పాట్‌ చలాన్‌ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పిన అధికారులు ఈ–చలాన్‌ జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులు తాము గమనించిన ఉల్లంఘనల్ని కేవలం ఫొటోలు తీస్తారు. వీటిని ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని ఈ–చలాన్‌ సెంటర్‌కు అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఆర్టీఏ చిరునామా ఆధారంగా చలాన్‌
ఈ ఫొటోలను పరిశీలించిన ఈ–చలాన్‌ సెంటర్‌ అధికారులు.. ఆర్టీఏ డేటాబేస్‌లో ఉన్న వాహన యజమాని చిరునామా ఆధారంగా చలాన్‌ను జారీ చేస్తున్నారు. ఇలా వాహనాల ను వినియోగిస్తున్న వారికి కాకుండా వాటి పాత యజమానులకే ఇవి వెళుతున్నాయి. ఉల్లంఘనలకు పాల్పడిన కొత్త యజమానికి జరిమానా చెల్లించకపోతే ఆ పెండింగ్‌ మొత్తం పాత యజమాని పేరుతో ఉండిపోతోంది. ఇటీవల ట్రాఫిక్‌ పోలీసులు భారీ మొత్తం ఈ–చలాన్‌ బకాయి ఉన్న వారిపై చట్ట పరమైన చర్యలు చేపడుతుండటంతో పాత యజమానులే బాధ్యులవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement