
కేసీఆర్ భరతం పడతాం
అవినీతి, అబద్ధాలతో పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ భరతం పడతామని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
ప్రాజెక్టుల టెండర్లపై సీబీఐ విచారణకు సిద్ధమా?: నాగం
సాక్షి, హైదరాబాద్: అవినీతి, అబద్ధాలతో పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ భరతం పడతామని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులు, రీడిజైన్లు, టెండర్లు, కాంట్రాక్టుల్లో అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ సీఎంకు సవాల్ విసిరారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో అవసరమైన కోదండరాం ఇప్పుడు చెడ్డవాడయ్యాడా? సీఎం అడుగులకు మడుగులొత్తితే మంచివాళ్లా? ప్రజల సమస్యలు, ఇచ్చిన హామీల గురించి అడగాలంటే టీఆర్‌ఎస్ అనుమతి తీసుకోవాలా? విద్యార్థులను, ప్రజాసంఘాలను కేసీఆర్ కట్టడి చేస్తున్నారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఆయన భరతం పట్టడానికి బీజేపీ కార్యకర్తలు, ప్రజలు సిద్ధం అవుతున్నారు’’ అని అన్నారు. కృష్ణా నదిలో తెలంగాణ జలాల వాటా కోసం ప్రధానిని కలుస్తామని నాగం చెప్పారు. మిషన్ కాకతీయ పనులపై త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తామన్నారు. కృష్ణా నదీజలాలపై పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు పూర్తి హక్కుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒకప్పుడు మహబూబ్‌నగర్‌ను దత్తత తీసుకున్నారని, దానికి అన్యాయం చేయొద్దని కోరారు.