
ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బివి.నాగరత్నం, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.
నాగం జనార్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెద్ద ఫ్రాడ్ జరిగిందన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2426 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం 65 శాతం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్‌కు చెల్లింపులు చేయాలి. 35 శాతం సివిల్ వర్క్స్‌కు మేఘాకు చెల్లింపులు చేయాలి.. కానీ, అంతర్గత ఒప్పందం ప్రకారం బీహెచ్ఈఎల్‌కు 65 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు. మేఘాకు 80 శాతం చెల్లింపులు జరిగాయి. 65:35 నుంచి 20:80 కు ఎలా మారింది. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ వాదనలు వినిపించారు.
న్యాయవాది ముకుల్ రోహతగి తన వాదనలు వినిపిస్తూ.. ‘‘తెలంగాణ హైకోర్టులో దీనికి సంబందించిన ఐదు పిటిషన్లు కొట్టివేశారు.. ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేదని స్పష్టం చేసింది. సివిసి కూడా ఇందులో ఏమి లేదని తేల్చింది. ఎస్టిమేషన్ పెంచడాన్ని తప్పు పడుతున్నారు. బీహెచ్‌ఈఎల్ కూడా ఇందులో ఫిర్యాదు చేయలేదు. ఏదో ఒక డాక్యుమెంట్ తెచ్చి కేసులు వేస్తున్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ బాగా పని చేస్తోంది’’ అని ముకుల్ రోహతగి తెలిపారు.