పుస్తకం.. ఓ మంచి దోస్త్‌ | Minister Harish Rao comments on literature | Sakshi
Sakshi News home page

పుస్తకం.. ఓ మంచి దోస్త్‌

Jan 29 2018 3:10 AM | Updated on Jan 29 2018 3:10 AM

Minister Harish Rao comments on literature - Sakshi

ఆదివారం బుక్‌ ఫెయిర్‌లో çపుస్తకాలను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: మనిషికి పుస్తకానికి మించిన దోస్తులు ఉండరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ 31వ జాతీయ పుస్తక మహోత్సవం ఆదివారం ముగిసింది.  ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని శాసిస్తున్నా.. పుస్తకాలను మాత్రం శాసించలేకపోతోందని అన్నారు. పుస్తకం అనేది ఒక చిరంజీవి అని, సీఎం కేసీఆర్‌ పుస్తకప్రియుడని, పుస్తకం కేసీఆర్‌ను నడిపిస్తుంటే కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందని, సాహిత్యం రుణాన్ని తీర్చుకోలేమన్నారు. భావితరాలకు పుస్తక విజ్ఞానాన్ని అం దించాలని పిలుపునిచ్చారు. పిల్లలను ఫోన్లు, టీవీలకు దూరంగా ఉంచి పుస్తకానికి చేరువ చేయాలని సీపీఎం నేత బీవీ రాఘవులు సూచించారు.  

ఆఖరి రోజు కిటకిట.. 
11 రోజులపాటు నిర్వహించిన ఈ పుస్తక ప్రదర్శనను సుమారు 9 లక్షల మంది పుస్తకప్రియులు సందర్శించారు. ఆదివారం ఆఖరిరోజు కావడంతో కిటకిటలాడింది. నచ్చిన పుస్తకం కోసం నగరవాసులు అన్వేషిం చారు. ఈ ఏడాది సుమారు 133 స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనేక అంతర్జాతీయ, జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. పిల్లల కోసమే 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు, నేటితరం యువతీ యువకుల్లో, పిల్లల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించేందుకు హైదరాబాద్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ కమిటీ 12 సాహిత్య సమాలోచనలను నిర్వహించింది. వేడుకల్లో భాగంగా పలువురు రచయితలు రాసిన 65 పుస్తకాలను ఆవి ష్కరించారు. పుస్తక ప్రదర్శనలో పిల్లల కోసం ప్రత్యేకంగా 25 కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు బుక్‌ ఫెయిర్‌ కమిటీ ప్రతినిధి చంద్రమోహన్‌ తెలిపారు. 

వైవిధ్యాన్ని చాటుకున్న స్టాళ్లు.. 
పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లు వైవిధ్యాన్ని చాటుకున్నాయి. ఆధ్యాత్మికం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యక్తిత్వవికాసం, ప్రముఖుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు వంటి పుస్తకాలతో పాటు తెలుగు సాహిత్యం, కథలు, నవలలు, విశ్లేషణాత్మక గ్రంథాలకు చక్కటి ఆదరణ లభించింది. మేనేజ్‌మెంట్, కెరీర్‌ రంగానికి సంబంధించిన పుస్తకాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు ఆధ్యాత్మిక గ్రంథాలు పెద్ద ఎత్తున అమ్ముడైనట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement