ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్‌కు విద్యార్థినులు చేతికి పెట్టుకున్న మెహిందీ అడ్డుతగిలింది.
ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్‌కు విద్యార్థినులు చేతికి పెట్టుకున్న మెహిందీ అడ్డుతగిలింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం విద్యార్థినులు చేతికి మెహిందీ పెట్టుకున్నారు. కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 9 నుంచి ప్రారంభమైన బీఈడీ సోషల్ స్టడీస్‌లో ప్రవేశానికి సర్టీఫిక్కెట్ల వెరిఫికేషన్‌కు నగరంలోని ఏవీ కాలేజీలో కౌన్సెలింగ్‌కు హాజరైన కొందరు విద్యార్థినుల చేతికి ఉన్న మెహిందీ వలన బయోమెట్రిక్ యంత్రం వారి చేతి గుర్తులను స్వీకరించడం లేదు. దీంతో వారికి మరోక రోజు అవకాశం ఇచ్చారు.
ఆదివారం (10న) చేతులు బాగ కడుకొని వచ్చినా చేయ్యంతా మెహిందీ వలన ఎర్రబడడంతో బయోమెట్రిక్ యంత్రం చేతి గుర్తులను స్వీకరించలేదు. బీఈడీ సోషల్ స్టడీస్ సర్టీఫిక్కెట్ల వెరిఫికేషన్ సోమవారంతో (11న) ముగియనున్నందున విద్యార్థినుల ఫోటోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎడ్‌సెట్-2016 ప్రవేశ పరీక్ష నాటికి వారి చేతులు మాములుగా ఉండడం వలన బయోమెట్రిక్ యంత్రంతో అప్పుడు సమస్య తలెత్తలేదు. కేవలం మెహింది చేతులకు పెట్టుకోవడం వలనే సమస్య వచ్చిందని ఎడ్‌సెట్ అధికారులు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన ఈ సమస్యపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.