
ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకుల్లో రాష్ట్ర సంస్థలకు మిశ్రమ ఫలితాలు
ఓవరాల్ ర్యాంకుల్లో ఉస్మానియాకు 53వ ర్యాంకు
గత ఏడాదితో పోల్చితే ఏకంగా 17 ర్యాంకుల పైకి
ఇంజనీరింగ్ విద్యలో జేఎన్టీయూహెచ్‌కు 94వ స్థానం
25 నుంచి 26కు తగ్గిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
మెరుగుపడిన ఐఐటీ హైదరాబాద్ స్థానం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీ సత్తా చాటింది. ఓవరాల్ కేటగిరీలో 2024లో 70వ స్థానంలో ఉన్న ఓయూ.. 2025లో ఏకంగా 17 ర్యాంకులు ఎగబాకి 53వ స్థానానికి చేరింది. రాష్ట్రంలో సాంకేతిక విద్యలో కీలకంగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) ఇంజనీరింగ్ విద్య విభాగంలో 88 ర్యాంకు నుంచి 94వ స్థానానికి పడిపోయింది.
2025 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకులను ఎన్‌ఐఆర్‌ఎఫ్ విడుదల చేసింది. బోధన, శిక్షణ, మౌలిక వసతులు, పరిశోధన, వృత్తి నైపుణ్యం మెళకువలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక పరమైన అంశాలతోపాటు ఇతర కొలమానాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయిస్తారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ కూడా ర్యాంకుల్లో సత్తా చాటింది. 2018–19 నుంచి 2023–24 సంవత్సరాల మధ్య ఆయా సంస్థల పరిధిలో ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చింది.
ఉపాధి, పరిశోధనలతో ఓయూ ర్యాంకు మెరుగు
ఓవరాల్ ర్యాంకు (జాతీయ సంస్థలన్నీ కలిపి)ల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఏడాది 53వ స్థానం సంపాదించింది. 2024లో 70వ ర్యాంకులో ఉంది. ఓయూలో 55 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే వారిలో 35 మంది రూ.6.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. గత ఏడాదితో పోలిస్తే వేతనం పెరిగింది. 1,069 మంది పీజీ విద్యార్థులు రూ.8 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. గత ఏడాది ఈ సంఖ్య 756 మాత్రమే.
స్పాన్సర్డ్ రిసెర్చ్ కార్యక్రమాలు స్వల్పంగా పెరిగాయి. అయితే రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువగా ఉండటం యూనివర్సిటీని ఇప్పటికీ వేధిస్తోంది. ఆశించిన మేర ర్యాంకు రాకపోవటానికి ఇదే కారణమని అధికారులు అంటున్నారు. ఓవరాల్ ర్యాంకుల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత ఏడాది 25వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది 26వ స్థానానికి పడిపోయింది. యూనివర్సిటీల కేటగిరీ ర్యాంకుల్లో కూడా 17 నుంచి 18కి తగ్గింది.
తగ్గిన జేఎన్టీయూహెచ్
రాష్ట్రంలో సాంకేతిక విద్యకు గుండెకాయలా ఉన్న జేఎన్టీయూహెచ్ ర్యాంకు ఈసారి పడిపోయింది. అయితే వివిధ విభాగాల్లో పాయింట్లు మాత్రం తమ వర్సిటీకి తగ్గలేదని అధికారులు తెలిపారు. 2024లో జేఎన్టీయూహెచ్‌కు ఇంజనీరింగ్ విభాగంలో 88వ ర్యాంకు రాగా, ఈసారి 94కు పడిపోయింది. విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ ఉత్తీర్ణత, ఉపాధి అవకాశాలు, పరిశోధనల్లో వర్సిటీ వెనుకబడటంతో ర్యాంకు తగ్గింది. ఈ విభాగంలో ఎన్‌ఐటీ వరంగల్ కూడా 21 స్థానం నుంచి 28వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఐఐటీ హైదరాబాద్ 8వ స్థానం నుంచి 7వ స్థానానికి చేరింది.
ఫ్యాకల్టీ లేకపోవడమే కారణం
జేఎన్టీయూహెచ్ ర్యాంకు తగ్గినా పాయింట్లు మాత్రం పెరిగాయి. రెగ్యులర్ ఫ్యాకల్టీని పెంచాల్సిన అవసరం ఉందని ఈ ర్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. పరిశోధనలు, వృత్తిపరమైన పురోగతికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం. ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. వచ్చేసారి మంచి ర్యాంకు పొందేందుకు కృషి చేస్తాం.
– ప్రొఫెసర్ టి. కిషన్‌కుమార్ రెడ్డి, వైస్ చాన్స్‌లర్, జేఎన్టీయూహెచ్.
సంతృప్తిగా ఉంది
ఓవరాల్ ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి మంచి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. పరిశోధన, బోధన సంస్కరణలపై పెడుతున్న శ్రద్ధ కారణంగానే ఈ ర్యాంకు సొంతం చేసుకుంది. యూనివర్సిటీలోని అందరి సమష్టి కృషి ఇది. భవిష్యత్‌లో మరింత ఉన్నతికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం.
– ప్రొఫెసర్ ఎం కుమార్, వైస్ చాన్స్‌లర్, ఉస్మానియా యూనివర్సిటీ.