దేవదాసును చితక్కొట్టి.. స్టేషన్కు ఈడ్చుకెళ్లింది | man arrested by the sexual harrasments | Sakshi
Sakshi News home page

దేవదాసును చితక్కొట్టి.. స్టేషన్కు ఈడ్చుకెళ్లింది

Aug 4 2015 5:12 PM | Updated on Jul 23 2018 8:49 PM

గత వారం రోజుల నుంచి వెంబడిస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకొచ్చి.. పోలీసుల ముందే చెప్పుతో కొట్టింది ఓ యువతి.

బంజారాహిల్స్: గత వారం రోజుల నుంచి వెంబడిస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు ఈడ్చుకొచ్చి.. పోలీసుల ముందే చెప్పుతో కొట్టింది ఓ యువతి. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ముషీరాబాద్‌లో నివసించే మల్లీశ్వరి (34) బంజారాహిల్స్ రోడ్ నెం.2 లోని సాగర్ సొసైటీలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన దేవదాసు (38) అనే కార్పెంటర్ వారం రోజుల నుంచి ఆమె వచ్చే బస్సులోనే వస్తూ వెంటాడుతున్నాడు. బంజారాహిల్స్‌లో ఆమె బస్సు దిగి తాను పని చేసే ప్రాంతానికి నడుచుకుని వెళ్లే సమయంలో అనుసరిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. తనతో మాట్లాడాలంటూ అడ్డుపడుతూ ఆమెను వేధించసాగాడు.

దీంతో విసిగిపోయిన బాధితురాలు ఈ వేధింపుల వ్యవహారాన్ని తన సోదరుడి దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం ఉదయం ఆమె తన  సోదరుడు, వదినను తీసుకొని ఎప్పటిలాగే బస్సులో బంజారాహిల్స్‌కు వచ్చి సాగర్‌సొసైటీకి నడుచుకుంటూ వెళ్తుండగా రోజులాగే దేవదాసు కూడా ఆమెను వెంబడించసాగాడు. మల్లీశ్వరి సోదరుడు, వదిన.. దేవదాస్ ను పట్టుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల ముందే బాధిత యువతి ఈవ్‌టీజర్‌ ను చెప్పుతో చితకబాదింది. పోలీసులు దేవదాసుపై ఈవ్‌టీజింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement