లోటు పేరుతో లూటీ!

లోటు పేరుతో లూటీ! - Sakshi


విద్యుత్ కొనుగోళ్లపై నిప్పులుచెరిగిన జగన్‌మోహన్‌రెడ్డి

 

 సాక్షి, హైదరాబాద్: లంచాల కోసమే ప్రైవేటు వ్యక్తులతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని శాసనసభలో విపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ భారాన్ని ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో కారుచౌకగా విద్యుత్ లభిస్తున్నా పట్టించుకోలేదని ఏపీఈఆర్‌సీకి ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్) రాసిన లేఖలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇవి మామూలు స్కామ్‌లు కావని ఈ లేఖలే స్పష్టం చేస్తున్నాయన్నారు.  శాసనసభలో శనివారం విద్యుత్ పద్దుపై వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి వీళ్ళు చెబుతున్నారు.ఐదేళ్ళు ఆయన పరిపాలన చేశారు. ఈ ఐదేళ్ళలో ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెరగలేదు. అసలా ప్రయత్నమే జరగలేదు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. గతంలో తొమ్మిదేళ్ళ చంద్రబాబు పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి’ అని విపక్ష నేత గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్‌రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిందని, అది తెలుగు కాంగ్రెస్ సర్కారు అని ఎద్దేవా చేశారు. కిరణ్ సర్కారు కరెంటు చార్జీలు పెంచితే, ఆనాడు తాము అది అన్యాయమని అవిశ్వాస తీర్మానం పెట్టామని, అప్పుడు సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే విప్ జారీ చేసి మరీ కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ చార్జీలపై పోరాటం చేస్తే బషీర్‌బాగ్ వద్ద పిట్టలను కాల్చినట్టు కాల్చారని, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, ఇవాల్టికి కూడా బషీర్‌బాగ్ కాల్పుల గురించి మనం చెప్పుకుంటామని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో కరెంటు చార్జీలు బాదుడు ఇప్పటికీ మరచిపోలేమని తెలిపారు. ఇదెక్కడి అన్యాయం?

► 2015-16 సంవత్సరంలో ఏపీ డిస్కమ్‌లు ఏకంగా 16 వేల మిలియన్ యూనిట్లు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళు చేయాలని ప్రతిపాదించాయని, ఏపీఈఆర్‌సీ మాత్రం కేవలం 757 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్ళకే పరిమితం కావాలని సూచించిందని, అయినా 15,262 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారని విపక్ష నేత ఆక్షేపించారు.

► బహిరంగ మార్కెట్లో తక్కువకే విద్యుత్ వస్తున్నా, ఏపీ డిస్కమ్‌లు యూనిట్ రూ.5.11పై.ల చొప్పున కొనుగోలు చేస్తున్నాయని ఏపీఈఆర్‌సీకి ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్) లేఖ రాసిందని విపక్ష నేత సభ దృష్టికి తెచ్చారు. ఇందులోని అంశాలను ఆయన ప్రస్తావిస్తూ...  2015-16 సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌లో 24 గంటల పాటు, యూనిట్ రూ. 3.77పై.లకే అందుబాటులో ఉందని, రాత్రి పూట రూ. 2.72పై.లకే లభిస్తోందని, 2015 డిసెంబర్ నాటికి ఇది యూనిట్ రూ.  2.71పై.లకే  24 గంటల పాటు, రాత్రి పూట రూ. 1.90పై.లకు లభిస్తున్న విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. దీన్ని పక్కనబెట్టి డిస్కమ్‌లు యూనిట్‌కు రూ. 5.11పై.ల చొప్పున కొనుగోలు చేయడాన్ని ఐఈఎక్స్ ఆక్షేపించిందన్నారు. (ఇందుకు సంబంధించిన లేఖలను ఆయన సభకు చూపిస్తూ కొన్ని అంశాలను చదివి వినిపించారు.)

► 2016-17కు సంబంధించి 64,706 మి.యూ. విద్యుత్ కొనుగోలు చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించాయని, ఇందులో ఏపీ జెన్‌కో, కేంద్రం వాటా, ఏపీజీడీసీఎల్ ద్వారా 39,420 మిలియన్ యూనిట్లను రూ. 15,983 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తే, ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఏకంగా  25,286 మిలియన్ల యూనిట్లను రూ. 11 వేల కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారని ఐఈఎక్స్ లేఖను ఉదహరిస్తూ అన్నారు.

► ప్రైవేటు కొనుగోలు విద్యుత్ వల్ల 2016-17లో డిస్కమ్‌ల విద్యుత్ కొనుగోలు యూనిట్ ధర రూ. 4.08పై.లు  పడుతోందని, అదే పవర్ ఎక్స్ఛేంజ్ ద్వారా అయితే, రూ. 2.40 లకే దొరుకుతుందన్నారు. లోటు విద్యుత్‌ను సాకుగా చూపించి యూనిట్‌కు రూ.1.68పై.లు ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులకు చెల్లించేందుకు సిద్ధపడ్డారని, దీనివల్ల నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగే వీలుందని ఐఈఎక్స్ లేఖలోని అంశాలను విశ్లేషిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇంత దారుణాలకు పాల్పడుతూ కూడా ప్రభుత్వం సిగ్గులేకుండా స్వీయ రక్షణ కోసం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

 బొగ్గులోనూ దగా...

► విదేశీ బొగ్గు కొనుగోళ్ళ వ్యవహారంలో ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకే పాల్పడ్డారని ప్రతిపక్ష నేత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీఈసీ లిమిటెడ్, ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ను ముందు పెట్టి అడ్డగోలుగా బొగ్గు కొనుగోలు చేశారని అన్నారు. పేరుకు ప్రభుత్వ రంగ సంస్థలే అయినా వెనుక ఉన్నది మాత్రం అదాని, మహాలక్ష్మి సంస్థలని తెలిపారు.

► 2013 మే 6న ఆరు నెలల కాలానికే విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని, ఆరునెలల తర్వాత ఎలాంటి టెండర్లు పిలవకుండా అదే సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారని బొగ్గు ధరలు తగ్గినా, పాత రేట్ల చొప్పునే చెల్లించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు.

► కాంట్రాక్టు సమయంలో (6 నెలలు)  12 లక్షల టన్నుల విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటే, గడువు తీరిన తర్వాత ఏకంగా మరో 19.25 లక్షల టన్నుల బొగ్గును అవే పాతరేట్లకే కొనుగోలు చేయడంలో ఔచిత్యమేమిటని నిలదీశారు. ఒప్పంద సమయంలో బొగ్గు ధర 69.15 డాలర్లు ఉందని, రవాణాతో కలుపుకుంటే 80.15 డాలర్లకు చేరుకుందని, ఆ తర్వాత దీని ధర తగ్గి, మార్చి నాటికి 52.4 డాలర్లకు పడిపోయిందన్నారు. అయినా, పాత రేట్ల ప్రకారమే చెల్లించడం ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. వీళ్లు చెబుతున్నదొకటి చేసేది మరొకటి అని విమర్శించారు.

 

 కొన్న మాట నిజమే: అచ్చెన్నాయుడు

 అత్యధిక రేట్లతో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ళు చేసినట్టు మంత్రి అచ్చెన్నాయుడు అంగీకరించారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఇది తప్పలేదన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని, దీన్ని అధిగమించడానికే కొనుగోలు చేశామని బదులిచ్చారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనతో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉందని, పరిశ్రమలు మూతపడ్డాయని, రైతులకు విద్యుత్ అందలేదని అన్నారు. ఆ కాలంలో రూ.25 వేల కోట్ల మేర సర్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారం వేశారని తెలిపారు.ప్రస్తుతం ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా ఉండాలనే విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ రంగం దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలి పారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.981 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచకతప్పలేదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ‘అచ్చెన్నాయుడు పుట్టిన రోజు నాడైనా నిజాలు మాట్లాడతాడనుకుంటే, అబద్దాలు మాట్లాడుతుంటే ఎలా..’ అని వ్యంగ్యోక్తి విసిరారు. అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విద్యుత్ పద్దుపై చర్చను ప్రారంభిస్తూ, సమర్థ నాయకత్వం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తీరాయని అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top