వామ్మో.. హైడర్‌బాద్.. | increasing air pollution in the capital | Sakshi
Sakshi News home page

వామ్మో.. హైడర్‌బాద్..

Aug 27 2015 12:20 AM | Updated on Sep 3 2017 8:10 AM

వామ్మో..  హైడర్‌బాద్..

వామ్మో.. హైడర్‌బాద్..

మహా నగరంలో వాయు కాలుష్యం బుసలు కొడుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాటేస్తూ కోరలు చాస్తోంది.

రాజధానిలో పెరుగుతోన్న వాయు కాలుష్యం
ఏడాదిలో సగం రోజులు పొల్యూషన్ కష్టాలు
పండగలు, సెలవు దినాల్లో కాస్త ఉపశమనం
దెబ్బతింటున్న శ్వాసకోశాలు, ముక్కుపుటాలు

 
 మహా నగరంలో వాయు కాలుష్యం బుసలు కొడుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాటేస్తూ కోరలు చాస్తోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 43 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులను కమ్మేస్తున్న దుమ్ముతో సిటీజనుల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఘనపుమీటరు గాలిలో ధూళి కణాలు (పీఎం 10) మోతాదు 60 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని పలు కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళి కాలుష్యం వెలువడుతోందని కాలుష్య నియంత్రణ మండలి తాజా అధ్యయనంలో తేలింది. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉండడం ఆందోళన కలిగించే విషయం. పలు కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు గుర్తించారు. బాలానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజులకు పైగానే కాలుష్య ఉద్ధృతి అధికంగా ఉన్నట్టు తేలింది. సెలవు రోజులు, పండగ వేళలు, వర్షం పడినపుడు, ట్రాఫిక్ రద్దీ అంతగాలేని రోజుల్లో కాలుష్య తీవ్రత కాస్త తగ్గడం ఒకింత ఉపశమనం కలిగిస్తోంది.
 - బంజారాహిల్స్ / సాక్షి,సిటీబ్యూరో
 
 మెట్రో నగరాల్లో 16వ స్థానం..
 గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశవ్యాప్తంగా 23 నగరాల్లో కాలుష్య తీవ్రతను సర్వే చేసింది. ఇందులో హైదరాబాద్ 16వ స్థానంలో నిలిచింది. కాలుష్య సూచీ ప్రకారం ఆ నగరాల ర్యాంకుల జాబితా ఇలా ఉంది..
 1. లక్నో, 2. ముంబాయి, 3. కోల్కత, 4. సూరత్, 5. జైపూర్, 6. విశాఖపట్నం, 7. గుర్గావ్, 8. లూధియానా, 9. ఢిల్లీ, 10. వడోదర, 11. చెన్నై, 12. పూణే, 13. మదురై, 14. నాగ్‌పూర్, 15. మీరట్, 16. హైదరాబాద్, 17. బెంగళూరు, 18. కోచి, 19. విజయవాడ, 20. కొయంబత్తూర్, 21. అహ్మదాబాద్, 22. నాసిక్, 23. తిరువనంతపురం.
 
పొల్యూషన్‌కు కారణాలివే..

గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య 43 లక్షలకు చేరింది. వీటికి ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత పెరుగుతోంది. నగరంలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ రోడ్లపైకి రావడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.వాహనాల సంఖ్య లక్షలు దాటినా.. గ్రేటర్‌లో6,411 కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతోంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఈ వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం(ధూళి రేణువులు) వంటి ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది.    
 
జరిగే అనర్థాలివీ..

వాయు కాలుష్యంలో టోలిన్, బెంజీన్ కాలుష్యం అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఉన్నవారు క్యాన్సర్, రక్తహీనత, టీబీ వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సల్ఫర్ డయాక్సైడ్ శ్వాసకోశాలను నాశనం చేసి బ్రాంక్రైటిస్‌కు కారణమవుతోంది.నైట్రోజన్ డయాక్సైడ్‌తో కళ్లు, ముక్కు మండుతున్నాయి. శ్వాసకోశాలకు తీవ్ర చికాకు కలుగుతోంది. అమ్మోనియా మోతాదు పెరగడం వల్ల కళ్ల మంటలతో పాటు శ్వాసకోశ భాగాలన్నీ దెబ్బతింటున్నాయి. పీఎం 10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్ వంటి వ్యాధులు సోకుతున్నాయి. దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటోంది. ఆర్‌ఎస్‌పీఎం మోతాదు పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement