తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన ఈశాన్య రుతుపవనాలు నిలిచిపోయాయి. రుతు పవనాలకు తుపాన్ అడ్డుగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తుపాన్ ప్రభావం తగ్గితే ఈశాన్య రుతుపవనాలు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో ఇప్పటివరకు కేవలం 67.7 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. అంటే 17% లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల కారణంగా సెప్టెంబర్‌లో 180% అధిక కుండపోత వర్షపాతం నమోదు కావడంతో రబీ పంటలకు ఇబ్బంది ఉండదని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.