
ఆదేశాలిచ్చినా కౌంటర్లు దాఖలు చేయరా?
తమ ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు చేయని పలు కార్పొరేట్ ఆస్పత్రులపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కార్పొరేట్ ఆస్పత్రులపై హైకోర్టు అసహనం
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు చేయని పలు కార్పొరేట్ ఆస్పత్రులపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకల్లా కౌంటర్లు దాఖలు చేసి తీరాలని స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని పేర్కొంటూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సోమవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
ఉభయ రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిని నిరోధించి మెరుగైన సేవలు ప్రజలు అందేలా చేసేందుకు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన నరేందర్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, పలు ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులిచ్చింది.