ఎమ్మెల్యే వివేకానందకు చుక్కెదురు | high court declains MLA vivekananda pititions | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వివేకానందకు చుక్కెదురు

May 12 2016 11:53 PM | Updated on Aug 31 2018 8:24 PM

ఎమ్మెల్యే వివేకానందకు చుక్కెదురు - Sakshi

ఎమ్మెల్యే వివేకానందకు చుక్కెదురు

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది...

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అక్రమంగా నిర్మించిన భవన సముదాయాలను కూల్చేయాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను నిలిపేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమంటూ తదుపరి విచారణను జూన్‌ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్, జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్లు 79 నుంచి 82 వరకు గల స్థలంలో జీహెచ్‌ఎంసీ అనుమతుల్లేకుండా భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారంటూ వివేక్‌ సమీప బంధువు కె.ఎం.ప్రతాప్‌ హైకోర్టులో గతేడాది ఏప్రిల్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ  కూల్చేయాలని తీర్పు ఇచ్చారు. భవన సముదాయంలోని కాలేజీని జూన్‌ 1కల్లా ఖాళీ చేయాలని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ వివేక్, ఆయన కుటుంబ సభ్యులతోపాటు నారాయణ కాలేజీ యాజ మాన్యం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా జస్టిస్‌ పి.వి.సంజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని గురువారం విచారించింది.

ఎమ్మెల్యే వివేక్‌ తరఫు న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి, నారాయణ కాలేజీ తరఫున బి.నళిన్‌కుమార్‌లు వాదనలు వినిపిస్తూ భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్‌) కింద పిటిషనర్లు దరఖాస్తు చేసుకున్నారని...బీపీఎస్‌పై హైకోర్టులో విచారణ సాగుతోందన్నారు. పిటిషనర్లు భవన నిర్మాణాలు చేపట్టే నాటికి బీపీఎస్‌ పథకం అమల్లో లేదు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పథకంపై పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల్లో అక్రమ కట్టడాలను కూల్చొద్దని సంబంధిత ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు కదా అని పేర్కొంది. సింగిల్‌ జడ్జి తీర్పు సమగ్రంగా ఉందని, దీని అమలును నిలి పేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement