గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్, కమిషనర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్, కమిషనర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. గురువారం సాయంత్రం మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఈ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఎల్‌ఈడీల ఏర్పాటుపై కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాండింగ్ కమిటీ పెండింగ్‌లో ఉంచింది. కమిటీ అనుమతివ్వకపోయినా డిసెంబర్ 4వ తేదీ నుంచి అమలులోకి తెస్తామని కమిషనర్ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిసింది. మేయర్ మహ్మద్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్‌ల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొంది.
ఒకటీ అరా సందర్భాల్లో వీరి మధ్య విభేదాలు బట్టబయలైనప్పటికీ, అంతలోనే సర్దుబాటయ్యాయి. రోడ్లపై చెత్తవేస్తే జరిమానా విధిస్తామనే ప్రకటనతో తమకు సంబంధం లేదని మేయర్ చెప్పడంతో పాటు మరికొన్ని అంశాల్లోనూ అభిప్రాయ భేదాలు బయట పడ్డాయి. తాజాగా.. రూ. 4వేల లోపు నివాస గృహాలకు ఆస్తిపన్ను రద్దుకు మేయర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం సమావేశమైన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. మరోవైపు నగరమంతా ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పా టుకు కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని స్టాండింగ్ కమిటీ పెండింగ్‌లో ఉంచడంతో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు బయటపడ్డాయి.
నగరాన్ని వరల్డ్‌క్లాస్ సిటీగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంతో పాటు విద్యుత్ పొదుపునకు ఉపకరిస్తుందనే భావనతో ఎల్‌ఈడీల ఏర్పాటుకు కమిషనర్ సిద్ధమయ్యారు. ఈ కాంట్రాక్టున ఈఈఎస్‌ఎల్‌కు అప్పగించేందుకు స్టాండింగ్ కమిటీ ముందుంచారు. దీనికి కమిటీ అంగీకరించలేదు. దీని ద్వారా తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే తలంపుతో కొందరు ముఖ్యనేతలు మేయర్ ద్వారా ఆటంకాలు సృష్టించినట్లు తెలుస్తోంది.
స్టాండింగ్ కమిటీలో చర్చ సందర్భంగా కమిషనర్ ఈ అంశంపై గట్టిగా పట్టుబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ‘మీరు ఇప్పుడు అంగీకరించకపోయినా.. డిసెంబర్4 తర్వాత అమల్లోకి తెస్తా’మని కమిషనర్ అన్నట్లు సమాచారం. డిసెంబర్ 3తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిపోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లు పెంచేందుకు కమిషనర్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో.. మేయర్ రూ. 4వేల లోపు ఆస్తిపన్ను రద్దు చేస్తూ ప్రకటన చేయడం విభేదాలపై ప్రచారాలకు ఊతమిస్తోంది.