వారం రోజుల్లో ఇవ్వండి | Give the days of Week | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో ఇవ్వండి

Aug 5 2016 12:44 AM | Updated on Mar 22 2019 2:57 PM

వారం రోజుల్లో ఇవ్వండి - Sakshi

వారం రోజుల్లో ఇవ్వండి

పాలమూరు, డిండి ఎత్తిపోతలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సమర్పించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి డెడ్‌లైన్ విధించింది.

పాలమూరు, డిండి డీపీఆర్‌లు సమర్పించాలని రాష్ట్రానికి కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు, డిండి ఎత్తిపోతలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సమర్పించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రాష్ట్రానికి డెడ్‌లైన్ విధించింది. వారం రోజుల్లో ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలన్నా, కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి తాము వివరణ ఇవ్వాలన్నా డీపీఆర్‌లే ప్రధానమని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషికి లేఖ రాశారు.

‘‘పాలమూరు, డిండిలకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు కోరినా స్పందించలేదు. ఇటీవలే ఈ ప్రాజెక్టుల విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో ఈ రెండు ప్రాజెక్టుల అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ పరిశీలిస్తుందని తెలిపింది. అందువల్ల డీపీఆర్‌లు సమర్పించండి. వీటినే కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి సమర్పిస్తాం. అపెక్స్ కౌన్సిల్ భేటీలోనూ వీటినే ముందుంచుతాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. వీటితో పాటే ఈ రెండు ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి వివరాలను నివేదిక రూపంలో తమకు సమర్పించాలని బోర్డు సూచించింది. ఈ లేఖతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల కాపీని జత చేసింది.

కృష్ణా జలాల విషయంలో తమకున్న కేటాయింపుల్లోంచే నీటిని వాడుకుంటున్నామని, ఎక్కడా పునర్విభజన చట్టాన్ని, ఇతర నిబంధనలను అతిక్రమించలేదని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తున్న తరుణంలో మరోమారు ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు రాసిన లేఖలో.. పాలమూరు ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013లోనే ఉత్తర్వులివ్వగా, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూలై 7న మరో జీవో వెలువరించారని తెలిపింది. అయితే తాజాగా ఏపీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, అపెక్స్ భేటీ నిర్వహించి సమస్య పరిష్కరించాలని సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement