ఫీజు దరఖాస్తుల పరిశీలన షురూ!

Fingerprint adoption for Aadhaar Authentication - Sakshi

     తొలుత ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థుల అర్జీల పరిశీలన 

     ఆధార్‌ అథెంటికేషన్‌ కోసం వేలిముద్రల స్వీకరణ 

     మీ సేవా కేంద్రాల్లో ఫింగర్‌ ప్రింట్స్‌ ఇవ్వాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తుల పరిశీలనను సంక్షేమ శాఖలు మొదలుపెట్టాయి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించిన ప్రభుత్వం.. వివిధ కోర్సుల్లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థుల దరఖాస్తులను ముందుగా పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యార్థుల అర్జీలను క్షుణ్నంగా పరిశీలించి అర్హతను తేల్చాలని జిల్లా సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

గత కొన్నేళ్లుగా విద్యాసంవత్సరం ముగిసిన తర్వాతే ఉపకార వేత నాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులూ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కోర్సులు ముగిసినా ఫీజులు చెల్లించని కారణంగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యాలు అట్టిపెట్టుకుంటున్నాయి. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఫీజులు చెల్లించడమో.. లేక ప్రభుత్వం నిధులిచ్చే వరకు వేచి చూడటమో జరుగుతోంది. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా కోర్సు ముగిసేనాటికి వారికి సర్టిఫికెట్లు అందించాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది విద్యార్థులు ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

మీ సేవా కేంద్రాల్లో.. 
దరఖాస్తుల పరిశీలనలో తొలుత విద్యార్థుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు తనిఖీ చేసి తర్వాత వేలిముద్రలు సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాల పరిశీలన మొదలైంది. ఆ ప్రక్రియ పూర్తయితే వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ కు సంక్షిప్త సమాచారం వస్తుంది. తర్వాత సమీప మీ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ ప్రక్రియను విద్యార్థులు పూర్తి చేయాలి. మీ సేవా సర్వర్‌ను ఈ–పాస్‌ వెబ్‌సైట్‌తో లింక్‌ చేశారు. వేలిముద్రలు సరిపోలిన వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌ ఐడీకి దరఖాస్తు చేరుతుంది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తిరిగి సంక్షేమాధికారి ఐడీకి వాటిని సమర్పిస్తారు. పరిశీలన ప్రక్రి య పూర్తవగానే ఉపకార వేతనం, రీయింబర్స్‌మెంట్‌ పథకాలకు అర్హులుగా తేల్చుతారు. 2017–18 విద్యా సంవత్సరం ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఉపకారవేతనాలు, రీయింబర్స్‌మెంట్‌కు రూ.650 కోట్ల బడ్జెట్‌ అవసరమని అంచనా వేసిన అధికారులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు.  

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top