టీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో దోపిడీ | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో దోపిడీ

Published Thu, Feb 27 2014 5:30 AM

Exploitation of the TRS leader's house

  •      చేతులు కట్టేసి.. చంపేస్తామని బెదిరించిన దుండగులు
  •      రూ. 1.5 లక్షల నగదు,4 తులాల బంగారం అపహరణ
  •  హయత్‌నగర్ , న్యూస్‌లైన్: నగర శివారుల్లో దోపిడీ దొంగలు విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ నాయకుని ఇంట్లో చొరబడి.. అతని చేతులు కట్టేసి రూ. 1.5 లక్షల నగదు, 4 తులాల నగలను దోచుకెళ్లారు.  పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పొగాకు నర్సింహ్మగౌడ్ పెద్ద అంబర్ పేట గ్రామానికి దూరంగా ఇటీవలే ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారు.  మంగళవారం రాత్రి 1.30కి గుర్తు తెలియని నలుగురు దుండగులు గ్రానేట్ రాయితో బలంగా తలుపును బాది.. గడియ విరగొట్టారు.

    ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్కడి నిద్రపోతున్న నర్సింహ్మగౌడ్, అతని భార్య, ముగ్గురు పిల్లలను లేపారు.  నర్సింహ్మగౌడ్ సెల్‌ఫోన్‌ను లాక్కొన్ని.. అతని చేతులను వెనక్కి మడచి తాళ్లతో కట్టేశారు. ఒంటిపై ఉన్న నగలు తీసి ఇవ్వాలని, ఇంట్లో ఉన్న వస్తువులు, నగదు ఇ వ్వలాని, లేకపోతే చంపేస్తామని అతని భార్య జయను దుండుగులు హెచ్చరించారు. దీంతో భయపడ్డ ఆమె పుస్తెల తాడు, చెవికమ్మలు, ఉంగరాన్ని తీసి ఇవ్వడంతో పాటు ఇంట్లో ఉన్న రూ. 1.5 లక్షల నగదు ఇచ్చారు. అనంతరం దుండగులు ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందర చేసి నర్సింహ్మగౌడ్‌ను తమ వెంట తీసుకెళ్లేందుకు యత్నించారు.

    తన భర్తను వదిలేయాలని జయ వారిని బతిమిలాడడంతో విడిచి వెళ్లిపోయారు. తాము నక్సలైట్లమని 10 నిమిషాల వరకు చప్పుడు చేయకుండా ఉండాలని, లేకపోతే ఇంటిపై బాంబులు వేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. అనంతరం నర్సింహ్మగౌడ్ సమీపంలో ఉండే తన సోదరుడు నిరంజన్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్, వనస్థలిపురం ఏసీపీ ఆనంద్‌భాస్కర్, హయత్‌నగర్‌సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలాన్ని సందర్శించారు. క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.  డాగ్‌స్వ్కాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
     
     ముసుగులు ధరించి వచ్చారు: జయ
     దుండగులు ముఖాలకు ముసుగులు ధరించారు. బనీయన్, డ్రాయర్లు మాత్రమే వేసుకొని ఉన్నారు.  నువ్వు మా చెల్లెలు లాంటిదానివి,  ఇంట్లో ఉన్న వస్తువులను ఇవ్వాలని తెలుగు, ఇంగ్లీష్‌లో అడిగారు.
     - జయ, బాధితురాలు
     

Advertisement
Advertisement