అరె కరెంటు రాదే !

అరె కరెంటు రాదే ! - Sakshi


సాక్షి,సిటీబ్యూరో:  ఓ వైపు ఉక్కపోత..మరోవైపు ఇష్టానుసారం కరెంటు తీస్తుండడంతో గత కొద్దిరోజులుగా నగరవాసులు నానాయాతన పడుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో అధికారిక విద్యుత్తు కోతలు లేనప్పటికీ...ఎమర్జెన్సీ లోడ్‌రిలీఫ్ పేరుతో పగలు,రాత్రి తేడాలేకుండా కరెంటు తీస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా కోర్‌సిటీలో మూడుగంటలు, శివారులో నాలుగు నుంచి ఐదుగంటలపాటు సరఫరా నిలిపివేస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సలు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరి స్థితి ఉందని వాపోతున్నారు. కోతలతో గృహాలు..వాణిజ్య సముదాయాలు..పరిశ్రమలే కాదు...ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, సినిమాహాళ్లు, పెట్రోలుబంకులు, ట్రాఫిక్ సిగ్నళ్లు, ఐస్‌క్రీమ్‌పార్లర్లు, బేకరీలు, చివరకు సెలూన్లు కూడా ఢ‘మాల్’అంటున్నాయి. కోతల వల్ల మోటార్లు పనిచేయకపోవడంతో మంచినీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

 

జిరాక్స్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌ల ఆదాయానికి గండిపడుతోంది. ఈసేవా కేంద్రాల్లో కరెంట్ లేకపోవడంతో సర్కారుకు వచ్చే ఆదాయం ఆలస్యమవుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతుండగా, బ్యాంకుల్లో సేవలు స్తంభించిపోతున్నాయి. కోతల వల్ల డీజిల్, పెట్రోలు అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వత్యాసం ఉంటుండడంతో కరెంటు కోతలు అనివార్యమవుతున్నాయి.పగటి ఉష్ణోగ్రతలకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుండటంతో సబ్‌స్టేషన్లపై భారం పడకుండా ఉండేందుకు ఎమర్జెన్సీలోడ్ రిలీఫ్‌ల పేరుతో ఇష్టం వచ్చినట్లు కరెంటు తీసేస్తున్నారు. పరిశ్రమలకు వాత: ప్రస్తుతం గ్రేటర్‌లోని పరిశ్రమలకు పవర్‌హాలీడే అమల్లో లేకున్నా కాటేదాన్, గగన్‌పహాడ్ పారిశ్రామికవాడల్లో 12 గంటలపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో ఉత్పత్తి నిలిచి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top